పాలకొల్లులో చిరు వెనుకంజ!
నియోజకవర్గం ప్రజల వైఖరి ఎలా ఉండబోతున్నదో యలమంచిలి గ్రామం రైతు గెద్దాడ సత్యనారాయణ సూచనప్రాయంగా తెలియజేశారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాల వల్ల మెజారిటీ ప్రజలు ఏదో ఒక విధంగా లబ్ధి పొందినందున నియోజకవర్గం ప్రజలు గుడ్డిగా చిరంజీవికి వోట్లు వేయబోరని సత్యనారాయణ చెప్పారు. 'ఈ ప్రాంతాన్ని చాలా కాలం క్రితమే వదలి వెళ్ళిన చిరంజీవికి నేను ఏవిధంగా మద్దతు ఇవ్వగలను? ఆయన ఒక కళాకారుడు కావచ్చు. కాని ఈ ప్రాంతం కోసం ఏదైనా చేయడంలో ఆయన విఫలుడు అయ్యారు' అని పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమడం గ్రామ రైతు కొప్పినీడి సత్యం అన్నారు. సినీ గ్లామర్ కొందరు యువజనులు, మహిళలపై ప్రభావం చూపవచ్చునని పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామ రైతు మంచెం వీరరాఘవులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పోరుకు రంగం మాత్రం సిద్ధమైంది. ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోమవారం పాలకొల్లులో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తరువాత ఆయన భీమవరం, ఉండి ప్రాంతాలలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆయన ఏలూరులో నైట్ హాల్ట్ చేస్తారు. పశ్చిమ గోదావరి చిరంజీవి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ ఎన్నికల అవకాశాలపై నాయకులతో చర్చించేందుకు డాక్టర్ రాజశేఖరరెడ్డి క్రితం నెల కూడా ప్రచారం నిర్వహిస్తూ ఏలూరులో నైట్ హాల్ట్ చేసిన విషయం విదితమే.
Pages: -1- 2 News Posted: 13 April, 2009
|