వైఎస్ తెగించారా?
ఎన్నికలకు ముందు కాలంలో తెలంగాణ వ్యతిరేక వైఖరిని ముఖ్యమంత్రి, ఆయన పార్టీ అనుసరించి ఉండి ఉంటే ఎవరికీ ఎటువంటి అభ్యంతరమూ ఉండేది కాదు. కాని తెలంగాణ ప్రాంతంలో పోలింగ్ మరి కాసేపటిలో ముగుస్తుందనగా రాయలసీమలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధితో కలసి బహిరంగ సభలో వైఎస్ ఆ విధంగా మాట్లాడడం తెలంగాణ ప్రజలను వంచించడంగానే పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ వాదులు కూడా ఆయన ప్రకటనకు అసంతృప్తి చెందినట్లు టివి ప్రసారాలు సూచించాయి కూడా.
ముఖ్యమంత్రి యధాలాపంగా అన్న మాటలు అవి అని భావించే అమాయకులు ఎవరూ లేరు. ఆయన అలా అనడానికి ఇంగిత జ్ఞానం లేని మనిషి కాదు. తెలంగాణలో ప్రతిపక్షానిదే పైచేయి అవుతున్నదని, అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే కాంగ్రెస్ రెండవ దశ పోలింగ్ జరిగే కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని 140 నియోజకవర్గాలలో గరిష్ఠ స్థాయిలో సీట్లు సాధించవలసి ఉంటుందని తెలిసే ఆయన వ్యూహాత్మకంగా అలా అని ఉంటారని చాలా మంది భావిస్తున్నారు.
తెలుగుదేశం ప్రకటించిన కలర్ టివిల పథకం, ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు రూ. 2000 నగదు బదలాయింపు పథకంపై నుంచి జనం దృష్టి మళ్ళించడం కాంగ్రెస్ ప్రధాన కర్తవ్యం అయింది. ఆ రెండు పథకాలూ జనాభిప్రాయాన్ని ప్రతిపక్షాలకు అనుకూలంగా మలుస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. గురువారం తన వ్యాఖ్యల ద్వారా వైఎస్ జనం దృష్టిని మరలించడంలో కొంత వరకు సఫలీకృతుడైనట్లు కనిపిస్తున్నది.
కోస్తా ఆంధ్ర ప్రాంతంలో చేపట్టిన రెండు ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులు - పోలవరం, పులిచింతల పనులు టిడిపి అధికారంలోకి వచ్చిన పక్షంలో ఆగిపోగలవనే అభిప్రాయాన్ని జనానికి కలిగించడం కాంగ్రెస్ మరొక బాధ్యత కాగలదు. ఎందుకంటే ఈ బృహత్ ప్రాజెక్టులు కనుక పూర్తయితే తెలంగాణలో సాగునీటి కొరత ఏర్పడగలదనే కారణంతో టిడిపి మిత్రపక్షం టిఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని కాంగ్రెస్ గట్టిగా ప్రచారం చేయవలసి ఉంటుంది. అయితే, ముఖ్యమంత్రి వ్యూహం ఫలిస్తుందా లేదా అనేది వేచి చూడవలసి ఉంటుంది. కాని ఈ రాజకీయ తెగింపు ధోరణి మాత్రం ఆయన ప్రతిష్ఠకు హాని కలిగించగలదు.
Pages: -1- 2 News Posted: 18 April, 2009
|