తిరుపతిలో చిరుకు గడ్డు స్థితి
తిరుపతి : ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో విజయం సాధించడానికి తిరుమలేశుని ప్రార్థించడంతో పాటు ఇంకా ఎంతో కష్టపడవలసి రావచ్చు. ఎందుకంటే పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఒక ప్రధాన కులం వారు ముఖం చాటేసే అవకాశం ఉండడం, కాంగ్రెస్ అభ్యర్థి కె. కరుణాకరరెడ్డి ఎత్తుగడలు చిరంజీవికి ఈ పుణ్యక్షేత్రంలో చెమటలు కక్కికిస్తున్నాయి.
పిఆర్పీ అధ్యక్షుని ఎలా అయినా ఓడించాలని తన సన్నిహిత అనుచరుడు కరుణాకరరెడ్డిని ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఆదేశించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది. 'తిరుపతిలో తనకు, చిరంజీవికి మధ్యే ముఖాముఖి పోటీ జరిగేట్లు చూసుకోవడానికై కరుణాకరరెడ్డి ముందుగా తెలుగుదేశం పార్టీ (టిడిపి) అభ్యర్థి కె. శంకరరెడ్డి అవకాశాలను దెబ్బతీశారు. ఫలితంగా శంకరరెడ్డి తన ప్రచారానికి దాదాపుగా స్వస్తి చెప్పారు' అని స్థానిక నాయకుడు ఒకరు చెప్పారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ అయిన కరుణాకరరెడ్డి గడచిన నాలుగు సంవత్సరాలుగా తిరుపతిలో తన బలం పెంచుకుంటూ వస్తున్నారని, ఇప్పుడు సిఎం అండతో ఆయన దీనిని దాదాపుగా ముఖాముఖి పోటీ చేయగలరని ఆ నాయకుడు పేర్కొన్నారు. కరుణాకరరెడ్డి తాను స్థానిక అభ్యర్థిననే విషయాన్ని తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. చిరంజీవి అలా ప్రచారం చేసుకోలేని స్థితి ఉన్నది.
బలిజ కులస్థులు దూరం కావడం కూడా చిరంజీవి అవకాశాలకు విఘాతం కలిగించవచ్చు. తిరుపతి నియోజకవర్గంలోని 2.34 లక్షల మంది ఓటర్లలో అగ్ర కులస్థులైన బలిజలు దాదాపు 40 వేల మంది ఉన్నారు. వారు ఆదిలో చిరంజీవికి బాసటగా ఉన్నారు. క్రితం సంవత్సరం ఆగస్టు 26న తిరుపతిలో ఆయన తొలి బహిరంగ సభ నిర్వహణలో వారు సాయం కూడా చేశారు.
అయితే, చిరంజీవికి వారిని కరుణాకరరెడ్డి దూరం చేసినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర బలిజ సంక్షేమ సమితి అధ్యక్షుడు అన్నా రామచంద్రయ్య తన మద్దతు కరుణాకరరెడ్డికే అని ఇటీవల ప్రకటించడాన్ని బట్టి ఇది విదితమవుతున్నది. 'తిరుపతిలోని బిసి కులాలన్నిటిలో అన్నా రామచంద్రయ్యకు వేలాది మంది తిరుగులేని అనుచరులు ఉన్నారు. కరుణాకర్ కు దీని వల్ల ప్రయోజనం చేకూరగలదు' అని పార్టీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 'బలిజలు తనకే ఓట్లు వేసేట్లు చూసుకోవడంతో పాటు కరుణాకర్ 35 వేల మంది రెడ్డి కులస్థులు, 30 వేల మంది బ్రాహ్మణుల ఓట్లపై కూడా ఆధారపడుతున్నారు' అని పార్టీ పరిశీలకుడు ఒకరు చెప్పారు.
Pages: 1 -2- News Posted: 18 April, 2009
|