హైదరాబాద్ : రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ ముగిసి ఉండవచ్చు కాని ఆ నియోజకవర్గాలలో రంగంలో ఉన్న అభ్యర్థుల బాధ్యత మాత్రం ముగియలేదు. అవిశ్రాంత ప్రచారం అనంతరం కొద్దిగా విశ్రాంతి తీసుకొందామని లేదా ఏదైనా విహారయాత్రకు వెళ్ళాలని అభిలషించిన వారి ప్రణాళికలకు పార్టీల బడా నేతలు గండి కొట్టారు. వారికి బడా నేతలు 'కొత్త బాధ్యతలు' అప్పగించారు.
తన నియోజకవర్గంలో పోలింగ్ ముగిసి 24 గంటలు కూడా గడవకుండానే చేవెళ్ళ లోక్ సభ స్థానం తెలుగుదేశం పార్టీ (టిడిపి) అభ్యర్థి ఎ.పి. జితేందర్ రెడ్డిని కొత్త బాధ్యతపై చిత్తూరుకు పార్టీ పంపింది. 'చిత్తూరులో తన ప్రచారంలో లోక్ సభ అభ్యర్థికి సాయం చేయవలసిందిగా నన్ను కోరారు. అందువల్ల నేను చిత్తూరుకు వెళుతున్నాను' అని జితేందర్ రెడ్డి చెప్పారు. 'మా సెలవులు ఏప్రిల్ 23 (రెండవ దశ పోలింగ్) తరువాతే మొదలవుతాయి' అని ఆయన నవ్వుతూ చెప్పారు.
సికింద్రాబాద్ లోక్ సభా స్థానం టిడిపి అభ్యర్థి సుధీష్ రాంభొట్ల నెల రోజుల పాటు రాత్రింబవళ్ళు కష్టపడిన తరువాత నగరంలో రద్దీకి దూరంగా ఒక విలాసవంతమైన సూట్ లో 'నిర్విరామంగా' విశ్రాంతి తీసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారు. కాని పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన ఒకే ఒక ఫోన్ కాల్ తో ఆయన తన విహారయాత్ర ప్లాన్ కు తాత్కాలికంగా స్వస్తి చెప్పవలసి వచ్చింది. సింగపూర్ లేదా స్విట్జర్లాండ్ వెళ్ళాలని అనుకుంటున్న సుధీష్ రాంభొట్ల ఇప్పుడు విజయవాడ వెళ్ళేందుకు సిద్ధం అవుతున్నారు.