సీమ నుంచే సిఎంలు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేసులో వున్న వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, చిరంజీవి రోండోవిడత ఎన్నికల్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముగ్గురూ రాయలసీమ ప్రాంతంలోనే బరిలో వున్నారు. చింజీవి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుతో పాటు, చిత్తూరు జిల్లా తిరుపతి నుండి కూడా పోటీ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లా పులివెందుల, చంద్రబాబు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వైఎస్, చంద్రబాబు తమ పార్టీల విజయంపై దృష్టి కేంద్రీకరించగా, చిరంజీవి మాత్రం పార్టీతో పాటు తన విజయంపై కూడా దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. రెండో విడత ఎన్నికల్లో గెలుపొందే స్తానాల సంఖ్యపైనే ఎవరు అధికారంలోకి వస్తారన్నది ఆధారపడి వుంది. ముఖ్యంగా మొదటిదశలో మెజారిటీ స్థానాలపై అంతగా ఆశ పెట్టుకోని ప్రజారాజ్యం పార్టీకి రెండో దశ ఎన్నికలు అత్యంత కీలకమైనవి.
ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధులు అందరి కంటె ముందు చిరంజీవి పాలకొల్లులో కాని, తిరుపతిలో కాని గెలుపొందవలసి వుంది. పులివెందులలో వైఎస్ కు, కుప్పంలో చంద్రబాబుకు గెలుపుపై వున్న ధీమా పాలకొల్లు, తిరుపతిలలో చిరంజీవికి కనిపించడం లేదు. కుప్పంలో చంద్రబాబుకు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ, గెలుపు మాత్రం బాబుదేనంటున్నారు. రాయలసీమలో 52, కోస్తాలో 88 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగనున్న రెండోదశ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలన్న పట్టుదలతో మూడు పార్టీలు ఉన్నాయి. మొదటిదశ ఎన్నికల్లో తమకు 70 నుంచి 80 స్థానాల వరకు రావచ్చని మూడు పార్టీలు భావిస్తున్నాయి. దీని ప్రకారం రెండో దశలో మూడు పార్టీలు కనీసం 70 నుంచి 80 స్థానాలు సాధించ గలిగితేనే అధికారం చేజిక్కించుకో గలవు.
Pages: 1 -2- News Posted: 19 April, 2009
|