వైఎస్ ఒంటరి అవుతారా?
హైదరాబాద్ : ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి విజయం సాధించడానికి 'ఒంటరి' పోరు సాగించాలన్న ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వ్యూహం బెడిసికొట్టినట్లయితే ఆయన తీవ్రమైన చిక్కులలలో పడే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో పార్టీ వజయం సాధించని పక్షంలో పార్టీ అధిష్టానవర్గం వైఎస్ నే పూర్తిగా బాధ్యుడిని చేస్తుందనే సూచనలు మంగళవారం రెండవ దశ ఎన్నికలకు ప్రచారం ముగిసిన తరుణంలో కనిపించాయి.
2004 ఎన్నికలలో పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తో సహా కాంగ్రెస్ నాయకులు అందరూ పార్టీ తరఫున ప్రచారం చేయగా ఈ పర్యాయం ప్రచారం అంతా వైఎస్ఆర్, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి పరంగానే సాగింది. వారిద్దరూ రాష్ట్రమంతటా రోడ్ షోలు నిర్వహించారు. పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ చాలా వరకు నిజామాబాద్ లో ప్రచారానికే పరిమితం కాగా, కేవలం ముగ్గురు మంత్రులు - విద్యుచ్ఛక్తి శాఖ మంత్రి మహమ్మద్ షబ్బీర్ అలీ, గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రెండవ దశలో ప్రచారం చేశారు. ఫలితంగా, గురువారం రెండవ దశ ఎన్నికల కోసం సిఎం శ్రమకోర్చి జిల్లాలలో ముమ్మరంగా రోడ్ షోలు నిర్వహిస్తూండగా తెలంగాణ ప్రాంతానికి చెందిన 17 మంది మంత్రులలో 14 మంది తమ ఇళ్ళలో విశ్రాంతి తీసుకోసాగారు. ప్రచారానికి మీ సేవలు అవసరం లేదని పిసిసి అధ్యక్షునికి చాలా కాలం క్రితమే స్పష్టంగా సూచించిన వైఎస్ఆర్ ప్రచారం చేయవద్దని తెలంగాణ మంత్రులను కూడా కోరినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి.
వైశ్యులు గణనీయ సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో స్థానిక నాయకులు ఆర్థిక మంత్రి కె. రోశయ్య సేవలను కోరినప్పటికీ ఆయనను కూడా చివరకు దూరంగా ఉంచారు. ఇక మీరెందుకు ప్రచారం చేయడం లేదని రోడ్లు భవనాల శాఖ మంత్రి టి. జీవన్ రెడ్డిని మీడియా ప్రశ్నించినప్పుడు 'ప్రజలను కలుసుకునేందుకు నేను నా నియోజకవర్గంలోనే ఉండిపోతున్నాను' అని ఆయన సమాధానం ఇచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జి. చిన్నారెడ్డి తాను గాంధీ భవన్ లో కూర్చొనడం ద్వారా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. బిసి సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ గౌడ్ అయితే రెండవ దశ ఎన్నికల కోసం ప్రచారం చేసే ఓపిక తనకు లేదని చెప్పారు.
Pages: 1 -2- News Posted: 22 April, 2009
|