కాపు మంత్రుల తిప్పలు
ఇక గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సొంత కాపు కులస్థుల నుంచే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఆయన విజయావకాశాలు పూర్తిగా ఎస్ సి, ముస్లిం ఓట్లపై ఆధారపడి ఉన్నాయి. పిఆర్పీ అభ్యర్థి తులసి రామచంద్రప్రభు గుంటూరు నగరంలో కాపులలో కొత్త నేతగా ఆవిర్భవించారు. నగరంలో 35 వేల మంది కాపు ఓటర్లు ఉన్నారు. టిడిపి కమ్మ కులస్థుడైన వాణిజ్యవేత్త చుక్కపల్లి రమేష్ ను నిలబెట్టినందున ఆ కులస్థులు ఆయనకే అండగా నిలబడే అవకాశం ఉంది. దీనితో కన్నా ఇరకాట స్థితిని ఎదుర్కొంటున్నారు.
ఇక జిల్లాలో ఫ్యాక్షన్ ప్రాంతమైన నరసరావుపేటలో కూడా ఫలితాన్ని పిఆర్పీ ప్రభావితం చేయవచ్చు. అక్కడ కాసు కృష్ణారెడ్డి (కాంగ్రెస్), కోడెల శివప్రసాదరావు (టిడిపి)లకు పోటీగా చిరంజీవి బలమైన వైశ్య కులస్థుని అభ్యర్థిగా నిలబెట్టారు. 8000 మందికి పైగా వైశ్యులు, 20 వేల మంది కాపులు మద్దతు ఇస్తుండగా పిఆర్పీ అభ్యర్థి విజయ కుమార్ వల్ల కృష్ణారెడ్డికి నిద్రే కరవవుతున్నది. మరొక వైపు రేవుల శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా టిడిపి, పిఆర్పీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ముగ్గురు అభ్యర్థులూ బిసిలే అయినప్పటికీ పిఆర్పీకి సుమారు 25 వేల మంది కాపు ఓటర్ల వలస పోవడం మంత్రికి పరిస్థితి సంక్లిష్టంగా మారింది.
Pages: -1- 2 News Posted: 22 April, 2009
|