దక్షిణాదిపైనే వారికి మక్కువ
కోలకతా : పారిశ్రామిక పెట్టుబడులను రాబట్టడంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి దేశంలోనే నంబర్ వన్ కావచ్చు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ పరిశ్రమలకు పెట్టుబడుల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుండవచ్చు. కాని దక్షిణాది రాష్ట్రాలలోని మెట్రో నగరాలే పెట్టుబడిదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. మూడు దక్షిణాది మెట్రో నగరాలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ గత కొన్ని సంవత్సరాలలో మౌలిక వసతుల రంగంలో సుమారు మూడు రెట్లు పెట్టుబడులను సమీకరించాయి.
అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అస్సోచామ్) నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ, ముంబై, కోలకతా నగరాలలో పలు కొత్త ఫ్లై ఓవర్లను నిర్మించినప్పటికీ, మౌలిక వసతుల మెరుగుదలకు ఇతర చర్యలు తీసుకున్నప్పటికీ మూడు దక్షిణాది మెట్రోలు ఇతర నగరాల కన్నా ఎంతో ముందంజలో ఉన్నాయి. 'దక్షిణ భారతదేశంలోని మెట్రో నగరాలు, ముఖ్యంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మౌలిక వసతులపై పెట్టుబడులకు సంబంధించి కార్పొరేట్ సంస్థలకు అత్యంత ప్రీతిపాత్రమైన గమ్యస్థానాలు అయ్యాయి' అని మెట్రో నగరాలలో మౌలిక వసతుల ప్రాజెక్టులపై అస్సోచామ్ అధ్యయనం నివేదిక తెలియజేసింది. ఈ నగరాలు 'ముంబై, ఢిల్లీ, కోలకతా వంటి నగరాలను మించిపోయాయి' అని నివేదిక పేర్కొన్నది.
దేశంలోని ఉత్తర, పశ్చిమ, తూర్పు ప్రాంతాలలోని ఇతర టైర్ 1 నగరాలలో కేవలం రూ. 14,240 కోట్ల మేరకు ప్రైవేట్ రంగ సంస్థలు పెట్టుబడి పెట్టగా దక్షిణాది మెట్రోలలో రూ. 33,161 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టినట్లు అస్సోచామ్ అధ్యక్షుడు సజ్జన్ జిందాల్ వెల్లడించారు. పెట్టుబడులపై తమ చాంబర్ 'భారతీయ మెట్రోలు: మౌలిక వసతుల పెట్టుబడుల సాధన' అనే అధ్యయనంలో దేశంలోని ఆరు మెట్రో నగారాలలో మౌలిక వసతుల ప్రాజెక్టులపై గల మొత్తం ప్రైవేట్ పెట్టుబడులలో 70 శాతం వాటా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలదేనని సజ్జన్ జిందాల్ తెలిపారు.
Pages: 1 -2- News Posted: 24 April, 2009
|