మిత్రుల లెఫ్ట్ చూపు
న్యూఢిల్లీ : వారికి లెఫ్ట్ అంటే ఇష్టం లేకపోవచ్చు. కాని దానిని వారు దూరం చేసుకోజాలరు. కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) మిత్ర పక్షాలు లెఫ్ట్ తో తిరిగి సమాచార సంబంధాలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కమ్యూనిస్టుల సంఖ్యాబలం పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ వారు కీలకమైన సంకీర్ణంలో భాగం కాగలరని ఆ పార్టీలు గ్రహించాయి.
సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ గడచిన 24 గంటలలో లెఫ్ట్ వైఖరి ఏమిటో తిరిగి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని లెఫ్ట్ సమర్థించదని ఆయన పునరుద్ఘాటించారు. గురువారం రెండవ దశ పోలింగ్ ఒక వైపు సాగుతుండగా మరొక వైపు యుపిఎలోని మూడు భాగస్వామ్య పక్షాలు ఎన్ సిపి, ఆర్ జెడి, ఎల్ జెపి కమ్యూనిస్ట్ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించాయి. 'లౌకిక' ప్రభుత్వం ఏర్పాటుకు కమ్యూనిస్టులు కీలకం కాగలరని ఆ పార్టీలు సూచించాయి. లెఫ్ట్ మద్దతు లేకుండా యుపిఎకు సంఖ్యా బలం పెరగదనే వాస్తవాన్ని గ్రహించే ఆ పార్టీలు ఆ సూచన చేశాయి.
'ఈ పర్యాయం మనకు లెప్ట్ పార్టీల ఆశీస్సులు, మద్దతు కావలసి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అందుకే లెఫ్ట్ తో సత్సంబంధాలు కొనసాగిద్దామని నేను ఆది నుంచి నా సహచరులు అందరితో చెబుతున్నాను' అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ తెలిపారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా ఈ ప్రతిపాదనకు వెంటనే స్పందించారు. 'మేము ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఎన్ సిపి, ఆర్ జెడి, ఎల్ జెపి ఒక స్థిర అభిప్రాయానికి వచ్చి మాకు మద్దతు ఇవ్వమనండి. మేము కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం' అని రాజా పేర్కొన్నారు.
తన లక్ష్యమైన బిజెపియేతర ప్రభుత్వానికి కాంగ్రెస్ సారథ్యం వహించరాదన్న తన వైఖరిని ప్రకాశ్ కరత్ మార్చుకోవడం లేదు. అయితే, కాంగ్రెస్ మద్దతును స్వీకరించడానికి ఆయనకేమీ అభ్యంతరం లేదు. 'కాంగ్రెస్ కనుక ఐచ్ఛికంగా మద్దతు ఇవ్వజూపితే మేము వద్దనాలి' అని కరత్ ఇంతకు ముందు హిందుస్థాన్ టైమ్స్ (హెచ్ టి) విలేఖరికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించారు.
Pages: 1 -2- News Posted: 25 April, 2009
|