ప్రియాంక ముక్కు ముచ్చట్లు
న్యూఢిల్లీ : ప్రియాంక గాంధి తన నాయనమ్మ ఇందిరా గాంధిలా కనిపిస్తారని మీరు భావిస్తుంటే ఆ సంగతి బయటకు అనకండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి కోపం వస్తుంది. గురువారం రాయబరేలిలో ప్రియాంక ఈ సంగతి ప్రస్తావనకు తీసుకురాలేదు. ఒక విలేఖరే ఈ విషయం ప్రస్తావించారు. బహుశా నా ముక్కు ఆమె ముక్కులా ఉండవచ్చునని ప్రియాంక మందహాసంతో సమాధానం ఇచ్చారు.
నెహ్రూ - గాంధి కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయాన్ని పట్టించుకునే తన అలవాటుకు తగినట్లుగా బిజెపి ఈ విషయంపై కూడా శుక్రవారం ఆక్షేపణ తెలియజేసింది. కనీసం ఎన్నికలలో అభ్యర్థి కూడా కాని ప్రియాంక అంటే బెదరిపోతున్నదేమో అనే సూచనలను బిజెపి వదలింది.
బిజెపి ఒకవైపు అలా చేస్తూనే, ఈ విషయాన్ని ఏమాత్రం ప్రాముఖ్యం లేనిదిగా పేర్కొన్నది. దేశాన్ని తీవ్రంగా వేధిస్తున్న సమస్యలపై నుంచి దృష్టిని మరలించే ప్రయత్నాన్ని కాంగ్రెస్ చేస్తున్నదని బిజెపి ఆరోపించింది.
'అసలు ఏమి జరుగుతోంది' బిజెపి అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. 'ఇందిర వలె ప్రియాంక కనిపిస్తున్నారా లేదా అనేది ఎన్నికల సమయంలో చర్చించదగిన అంశం కాదు' అని ఆయన అన్నారు.
రాహుల్, ప్రియాంకలకు సంబంధించి బిజెపి నాయకుల స్పందనలు భిన్నంగా ఉంటుంటాయి. రాహుల్ ను 'రాజకీయాలలో ఇంకా ఎంతో నేర్చుకోవలసిన పిల్లవాడు'గా వారు పేర్కొంటారు. కాని ప్రియాంక విషయంలో వారు ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం లేదు. రాజకీయ ప్రావీణ్యం ఉన్న మనిషిలా ప్రియాంక కనిపిస్తుంటారు.
అయితే, ప్రియాంకకు మీడియా అమిత ప్రాముఖ్యం ఇస్తుండడం పట్ల బిజెపి నాయకులు పలువురు విడిగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. రోజూ 'ప్రియాంక'కు సంబంధించిన వార్తలు ఇవ్వడానికి అన్ని టివి చానెళ్ళూ ఎందుకు అమేథి, రాయబరేలిలలో శాశ్వతంగా ఒక ఒబి వ్యాన్ ను నిలిపి, ఒక విలేఖరిని నియమించాయని వారు ప్రశ్నిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 25 April, 2009
|