'రాజ్యం'తో దేశం చర్చలు?
హైదరాబాద్: ఈ సారి ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ ధీమాగా చెబుతూనే, ప్రభుత్వం ఏర్పాటులో ప్రజారాజ్యం పార్టీ సహకారాన్ని పొందడానికి ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రెండు విడతలుగా జరిగిన ఎన్నికల్లో మహాకూటమికి అవసరమైన స్థానాలు వస్తాయని, ఇతర పార్టీలతో పొత్తు అవసరం లేదని చెహుతూ వస్తున్న తెలుగుదేశం నాయకత్వం తాజాగా తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు తెలిసింది. ప్రజారాజ్యం పార్టీకి కనీసం 35 నుంచి 40 సీట్లు వస్తాయని తెలుగుదేశం సర్వేలో వెల్లడైన దృష్ట్యా, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైతే ఆ పార్టీ సాయం తీసుకోవాలనుకుంటున్నట్టు తెలిసింది.
పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్దన రెడ్డి, ప్రజారాజ్యం నాయకుడు కోటగిరి విద్యాధరరావుతో ఈ విషయమై మంతనాలు జరుపుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగు సరళి గురించి అడిగి తెలుసుకున్న నాగం, ప్రభుత్వం ఏర్పాటులో ప్రజారాజ్యం సహకారం అవసరమవుతుందని కోటగిరికి చెప్పారట. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఏ విధంగానైనా అడ్డుకోవాలని ఈ రెండు పార్టీలు వ్యూహరచనలో నిమగ్నమైనట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి 80కి మించి సీట్లు రావనీ, అందువల్ల ప్రజారాజ్యం, టిఆరెస్ లతో కలసి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తోందనీ రాజకీయవర్గాల్లో చర్చ జరుతుండడంతో ఉలిక్కిపడిన తెలుగుదేశం ప్రజారాజ్యం, టిఆరెస్ లు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించిందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
Pages: 1 -2- News Posted: 4 May, 2009
|