బాబుకు బిజెపి బుజ్జగింపు
హైదరాబాద్ : తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడు తాను తృతీయ ఫ్రంట్ లోనే కొనసాగుతానని మంగళవారం కూడా విస్పష్టంగా ప్రకటించినప్పటికీ ఆయనను జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్ డిఎ) తిప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. ఎన్ డిఎకు మద్దతు ఇవ్వాలన్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నిర్ణయంతో ఉత్సాహం పొందిన బిజెపి కేంద్ర నాయకత్వం టిడిపిని కూడా తమ వైపు తిప్పే బాధ్యతను సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్య నాయుడుకు అప్పగించింది. చంద్రబాబు నాయుడుతో వెంకయ్య నాయుడు టెలిఫోన్ లో మాట్లాడారు. అయితే, తాము ఆ కాషాయ పార్టీతో సంప్రదింపులు సాగిస్తున్నామనే వార్తను టిడిపి ఖండించింది.
హైదరాబాద్ నగరంలో స్వల్ప వ్యవధి పర్యటనలో భాగంగా మంగళవారం పార్టీ సమావేశానికి హాజరైన వెంకయ్య నాయుడు మీడియాకు పెద్దగా వివరాలు తెలియజేయలేదు. 'ఎన్నికల అనంతర పొత్తులపై చర్చలు మే 16 తరువాతే మొదలవుతాయి. బిజెపి ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుంది. అద్వానీని ప్రధానిగా చూడాలని కోరుకునే పార్టీ ఏదైనా మాతో కలసి పని చేస్తామంటే స్వాగతిస్తాం' అని మాత్రమే వెంకయ్య నాయుడు మీడియాతో చెప్పారు.
అయితే, పోలింగ్ సరళిపై పార్టీ సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తాను తృతీయ ఫ్రంట్ కే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ ఫ్రంట్ అధికారంలోకి రాగలదనే దృఢవిశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 'ఓట్ల లెక్కింపు అనంతరం టిడిపి, వామపక్షాలు, ఎఐఎడిఎంకె, బిఎస్ పి సమావేశమై కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుపైన చర్చిస్తాయి' అని ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించగలవని ఆయన ఉద్ఘాటించారు.
Pages: 1 -2- News Posted: 13 May, 2009
|