బాబుకు బిజెపి బుజ్జగింపు
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో చర్చలు జరిపిన అనంతరం వెంకయ్య నాయుడు టిడిపి అధినేతతో ఫోన్ లో మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ లోని, ఇతర ప్రాంతాలలోని ఇతర పార్టీలను ఎన్ డిఎ పంచన చేర్చడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని వెంకయ్య నాయుడుకు చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు.
కాగా, టిఆర్ఎస్ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోలేకపోయిన వామపక్షాలు మరొక భయానికి లోనవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎంతగా కాదంటున్నా ఆయన కూడా ఎన్ డిఎ శిబిరంలో చేరిపోతే టిడిపితో 'మహా కూటమి' ఏర్పాటుకు తాము చేసిన ప్రయత్నాలన్నీ నిరర్థకం అవుతాయేమోనని అవి భయపడుతున్నాయి. టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు పంజాబ్ లో బిజెపితో కలసి భాంగ్రా నృత్యం చేయడం కమ్యూనిస్టు మిత్ర పక్షాలను కలవరానికి గురి చేయగా ఆ కాషాయ పార్టీతో చంద్రబాబు కూడా చెలిమి చేయడం మహా కూటమికి చావు దెబ్బ కాగలదు.
ఇదే కనుక జరిగినట్లయితే, టిఆర్ఎస్ వ్యవహరించిన తీరుతోను, చంద్రబాబు నాయుడు 'వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న మౌన వైఖరి'తోను అసంతృప్తి చెందిన వామపక్షాలు కాంగ్రెస్ పార్టీనే మిత్ర పక్షంగా భావించవచ్చు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చునని, అందువల్ల మహా కూటమి నుంచి చంద్రబాబు, కెసిఆర్ వలస వెళితే కమ్యూనిస్టులకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం తేలిక అవుతుందని సిపిఐ భావిస్తున్నట్లు సిపిఐ వర్గాలు తెలియజేశాయి.
అయితే, బయటకు మాత్రం వామపక్షాలు, టిడిపి కలసి సాగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు సోమవారం రాత్రి సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్ తోను, బిఎస్ పి అధ్యక్షురాలు మాయావతితోను మాట్లాడినప్పుడు తృతీయ ఫ్రంట్ కే తాను కట్టుబడి ఉన్నట్లు పునరుద్ఘాటించారని తెలుస్తున్నది. కాని ఎన్ డిఎ పట్ల కెసిఆర్ తాజా అభిమానం విషయమై మాత్రం చంద్రబాబు మౌనం వీడడం లేదు.
Pages: -1- 2 News Posted: 13 May, 2009
|