`దేశం'లో మరో ఐదేళ్ళ చీకటి
హైదరాబాద్ : అవినీతి మంత్రంతో అధికార కాంగ్రెస్ ను అవలీలగా ఓడించవచ్చు... అధికార పీఠాన్ని అలవోకగ అందుకోవచ్చు అని ఆశించిన చంద్రబాబు నాయుడు కలలు కల్లలయ్యాయి. 2009 ఎన్నికలు పీడకలను మిగిల్చాయి. అయినా తప్పదు మరో అయిదేళ్ళు చీకటిలోనే గడుపుతూ పీడకలలకు ఉలిక్కి పడక తప్పదు. తొమ్మిదేళ్ళ అధికారం అనంతరం చంద్రబాబు ఐదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఆకాలమంతా గడ్డుగానే గడిచింది. దాదాపు మూడేళ్ళు తెలుగుదేశం పార్టీ యంత్రాంగం నిరాశతో, నిస్తేజమై పోయింది. ఎన్నికల సృహ రాగానే సంవత్సరం హంగామా చేసినా ఫలితాలు దక్కలేదు. ప్రతిపక్షంలో వుండి ప్రాంతీయ పార్టీని నడపడం దుస్సాధ్యమని చంద్రబాబుకు తెలుసు. మరో ఐదేళ్ళు ఈ పార్టీని జవసత్వాలతో ఉంచడం ఇక ఆయనకు కత్తిమీద సామే కావచ్చు. ఆయన రాజకీయ నాయకత్వ పటిమకు అగ్ని పరీక్షే కావచ్చు. అధికారంలో ఉన్నప్పుడు అందే అండదండలు, పీఠం దిగిన తరువాత ఆదుకునే వారు ఉండరని చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే అనుభవంలోకి వచ్చిన వాస్తవం. ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారే సూచనులే కనిపిస్తున్నాయి.
రాజకీయ చతురుడైన చంద్రబాబు భవిష్యత్తును అర్థం చేసుకోలేని వ్యక్తేం కాదు. అందుకే మొదటిసారి 2004లో అధికారం కోల్పోయినప్పుడు ఆయన తన సహచరుడు ఎర్రబెల్లి దయాకర్ రావుతో 'ఇప్పుడే ఇలా నిరుత్సాహ పడితే ఎలా మనం ప్రతిపక్షంలో ఇంకా 60 నెలలు ఉండాల్సి వస్తుంది, అధికార పక్షంతో వేగక తప్పదు' అనడాన్ని గుర్తు చేసుకుని తీరాలి. 2004 మే 14 నుంచి ఆయన ప్రతి రోజునూ కేలండర్ లో మైనస్ చేసుకుంటూనే కాలం గడిపారు. 2004 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయిన తరువాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశంలోనే టిడిపి సభ్యులు స్పీకర్ పై విమర్శలు మొదలు పెట్టారు. సార్ స్పీకర్ మన మాట వినడం లేదు, ఆయన్ని మళ్లీ నేను కలవను అంటూ అసెంబ్లీలో చంద్రబాబు చాంబర్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పగా, మరో 60 నెలలు నిరీక్షించక తప్పదని చంద్రబాబు ఆ రోజు నుంచి లెక్కలు చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఎప్పటికప్పుడు టిడిపి నాయకులు రోజులు లెక్కిస్తూ కాంగ్రెస్ కు రోజులు దగ్గర పడ్డాయి, కౌంట్ డౌన్ మొదలైంది అంటూ లెక్కలు చెప్పారు. మరో ఐదేళ్ళపాటు ఇదే విధంగా రోజులు లెక్కించడం అంటేనే నిరుత్సాహం ఆవరిస్తోందని టిడిపి నాయకులు చెబుతున్నారు.
Pages: 1 -2- News Posted: 18 May, 2009
|