దేశంలో ఐదేళ్ళ చీకటి
టిడిపి ఆవిర్భావం తరువాత 1989లో టిడిపి తొలి సారిగా ప్రతిపక్షంలో కూర్చుంది. ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా వున్నా, వ్యవహారం మొత్తం చంద్రబాబు నిర్వహించే వారు. 2004లో చంద్రబాబు తొలిసారిగా నేరుగా ప్రతిపక్ష నాయకుని పాత్రులో ప్రవేశించారు. అయితే ఆ ఎన్నికల్లో టిడిపికి కేవలం 47 సీట్లు మాత్రమే లభించాయి. దాంతో చంద్రబాబు పార్టీని రక్షించుకోవడానికి తప్పదన్నట్టు మొదటి రోజు నుంచే హడావుడి మొదలుపెట్టారు. అధికార పక్షంపై మొదటి వారంలోనే అవినీతి ఆరోపణలు చేశారు. అధికార పక్షానికి కొన్ని రోజుల సమయం ఇచ్చి దాడి మొదలు పెడితే బాగుండేదని కొందరు నాయకులు సూచిస్తే పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చి ఉంటే అలా చేసేందుకు అవకాశం ఉండేదని, ఇలాంటి పరిస్థితిలో పార్టీని రక్షించుకోవాలంటే మొదటి రోజు నుండే దాడి చేయక తప్పదని చంద్రబాబు వివరించారు.
అధికార పక్షానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మొదటి రోజు నుంచే దాడి జరపడం వల్ల ప్రతిపక్షంగా టిడిపి పాత్ర ప్రజల మద్దతు సాధించలేకపోయిందని ఫలితాల తరువాత టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఈసారి బలమైన ప్రతిపక్షంగా ఉన్నందున వ్యూహాత్మకంగా వ్యవహరించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించక పోతే పార్టీ పని అయిపోయినట్టే అనే ప్రచారం సాగినప్పటికీ అధికారంలోకి రాకపోయినా 91 సీట్లలో విజయం సాధించినందున బలమైన ప్రతిపక్షంగా ఉంటామని టిడిపి నాయకులు చెబుతున్నారు. అయితే తొలిసారి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ముందు నుంచే హడావుడి చేశామని ఈసారి అలా కాకుండా అధికార పక్షానికి కొన్ని రోజుల సమయం ఇచ్చి ఆ తరువాతనే నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తామని టిడిపి నాయకులు చెబుతున్నారు. 91 సీట్లలో విజయం సాధించామంటే పార్టీకి భవిష్యత్తుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మున్సిపల్ ఎన్నికల నాటికి పార్టీ పుంజుకుంటుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. పార్టీలో లోపాలను సరిద్దిద్దుకుని ముందుకు వెళతామని అంటున్నారు.
అధికారం ఖాయం అని కలలు కన్న టిడిపి నాయకులు ఏకంగా మంత్రివర్గాన్ని సైతం ఖరారుచేసుకున్నారు. ఫలితాలు ఇలా రావడంతో షాక్ నుంచి తేరుకోలేక పోయారు. ప్రజారాజ్యం వల్ల దెబ్బతిన్నామా? లేక మహాకూటమికి ఏర్పడి పెద్ద సంఖ్యలో సీట్ల పంపంకం జరిగినందువల్ల ఓడిపోయామా? అని లెక్కలు వేసుకుంటున్నారు. టిడిపి వల్ల తమకు ఎలాంటి మేలూ కలగలేదని, ఓట్ల బదిలీ జరగలేదని టిఆర్ఎస్ చెబుతుండగా, మహాకూటమి వల్ల నష్టపోయామని, మిత్రపక్షాల వల్ల తమకు ఎలాంటి లాభం కలగలేదని టిడిపి నాయకులు చెబుతున్నారు. ఓడిపోయిన పరిస్థితిలో తక్షణం ఒక నిర్ణయానికి రాకుండా అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విశ్లేషణ జరపాలని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నట్టు టిడిపి నాయకులు చెప్పారు.
Pages: -1- 2 News Posted: 18 May, 2009
|