హైదరాబాద్ : చిరంజీవిలో పాలకొల్లు స్థానంపై నెలకొన్న అతివిశ్వాసం ఆయన విజాయకాశాలను దిగజార్చింది. మామగారి ఊరైన పాలకొల్లు ప్రజలు తనను అల్లుడిలా ఆదరిస్తారని ఆయన భావించారు. చిరంజీవి భార్య సురేఖ కోరిక మేరకు ఆయన పాలకొల్లు నుంచి పోటీ చేశారు. పాలకొల్లు వాసులంతా చిరంజీవిని అల్లుడిలా భావించలేదు. కనీసం ఇంటికొచ్చిన చుట్టంలా కూడా ఆదరించలేదు. మూడో తారీఖున నామినేషన్ దాఖలు చేసిన చిరంజీవి చక్కగా తిరుపతి వెళ్ళిపోయారు. ఆ రోజున ఆయన్ను చూసేందుకు మాత్రం జనం ఎగబడ్డారు. అయితే అదంతా ఆయనకున్న సినీగ్లామర్ దృష్ట్యా చూసేందుకు వచ్చిన జనం మాత్రమేనని ఆయన్ను తమ స్వంత వ్యక్తిగా పాలకొల్లు వాసులు భావించలేదని ఫలితాలు వచ్చాక గాని అర్థం కాలేదు.
చిరంజీవితో పాటు ఆయన కుటుంబ సభ్యుల పట్ల పాలకొల్లు ప్రజల్లో ఆదరణ కనిపించలేదు. అన్నింటికి మించి చిరంజీవి రాజకీయాల్లోకి రమ్మని పోరుపెట్టి ఆయన వెన్నంటి నిలిచిన స్థానికుడు చేగొండి హరిరామజోగయ్య పట్ల ఈ ప్రాంత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. జోగయ్య కుమారుడు కూడా ఆయనకు వ్యతిరేకం గానే పని చేశారు. చిరంజీవి గెలిచినా ఆయన పాలకొల్లు స్థానానికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరుగాసాగింది. ఒకవేళ చిరంజీవి పాలకొల్లు నుంచే ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఆయన స్థానంలో జోగయ్య మనిషిని ఇక్కడ ఇన్ చార్జిగా పెడతారని ప్రజలు భావించారు. ఇక జోగయ్య ఆధిపత్యం తమపై పెరుగుతుందని భయపడ్డారు. గత ఎన్నిక్లలో జోగయ్య దశ తిరిగి ఎమ్ పి అయ్యారు. అప్పటి నుంచి సొంత పార్టీపై విమర్శలకు పాల్పడ్డారు. గత రెండేళ్ళుగా ఆయన తీరు నియోజకవర్గంలో వివాదాస్పదంగా మారింది. చిరంజీవి తన పాకెట్లో ఉన్నాడన్న రీతిలో స్థానిక పార్టీ శ్రేణుల వద్ద ఆయన వ్యవహరించారు. చిరంజీవిని ఓడించాలన్న దృక్పధం కేవలం జోగయ్య వ్యవహారశైలి వల్లే పాలకొల్లు వాసుల్లో కలిగింది.