పర్యవేక్షక పాత్రలో రాహుల్!
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అమేథి నుంచి తిరిగి ఎంపిగా ఎన్నికైన రాహుల్ గాంధికై మున్ముందు నిర్వహించే బాధ్యతపై నిర్ణయాన్ని వదలివేస్తే మంత్రి కావడం కన్నా ప్రభుత్వంపై పర్యవేక్షక పాత్ర పోషించడానికే ఆయన ఇష్టపడవచ్చు. మంత్రివర్గంలో చేరేట్లుగా రాహుల్ గాంధిని ఒప్పించేందుకు తాను శాయశక్తులా ప్రయత్నిస్తానని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. కాని రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అయితే, ప్రభుత్వం వెలుపల నుంచే పర్యవేక్షక బాధ్యతలను నిర్వర్తించడాన్ని రాహుల్ కోరుకోవచ్చునని పార్టీ ఆంతరంగికుల అభిప్రాయం. దీని వల్ల 'ఆమ్ ఆద్మీ' అజెండా నుంచి ప్రభుత్వం పక్కకు జరగకుండా చూడవచ్చునని రాహుల్ భావిస్తున్నట్లు వారు చెబుతున్నారు. 'ప్రభుత్వ విధానాలకు మార్గదర్శకత్వం వహించేందుకు రాహుల్ మంత్రిగానే ఉండవలసిన పని లేదు' అని పార్టీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 'ఆయన రాడార్ లో ఉన్న పలు మంత్రిత్వశాఖలు - గ్రామీణ ఉపాధి, ఆరోగ్యం, వ్యవసాయం, కార్మిక, మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్ డి) - కాంగ్రెస్ కే దక్కవచ్చు కనుక వాటి కార్యకలాపాల గురించి స్వయంగా తెలుసుకోవడానికి పార్టీ ఒక యంత్రాంగాన్ని రూపొందించగలదు' అని ఆ ప్రతినిధి సూచించారు.
జాతీయ సలహా మండలి (ఎన్ఎసి) పునరుద్ధరణ విషయమై కాంగ్రెస్ ఇంతవరకు ఆలోచించలేదు. ఇంతకుముందు మండలికి సోనియా గాంధి సారథ్యం వహించారు. కాని లాభసాటి పదవుల వివాదం తలెత్తిన తరువాత ఆమె ఆ పదవి నుంచి తప్పుకొన్న తరువాత మండలి రద్దయింది. గ్రామీణ ఉపాధి కల్పన పథకం, సమాచార హక్కు చట్టం వంటి ప్రభుత్వ ప్రధాన పథకాలు కొన్నిటికి ఈ మండలి రూపకల్పన చేసింది. ఆర్థిక సరళీకరణ మరీ శ్రుతి మించకుండా ఈ మండలి అడ్డుకోగలదని భావించారు.
ఆర్థిక సంస్కరణలలో పెన్షన్, బీమా సంస్కరణలు, విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశం వంటి 'అసంపూర్తి బాధ్యతలను' ప్రభుత్వం పూర్తి చేసేట్లు చూడాలని కాంగ్రెస్ పార్టీలో కొందరు ఆత్రుతతో ఉన్నప్పటికీ రాహుల్ ఆలోచన కొంత భిన్నంగా ఉన్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆహార భద్రత చట్టం, సమాజంలోని బడుగు వర్గాలకు భద్రత పథకం వంటి జనహిత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో ప్రభుత్వం తన ఇన్నింగ్స్ ను ప్రారంభించాలని రాహుల్ అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాలు ఇవి.
Pages: 1 -2- News Posted: 19 May, 2009
|