టిఆర్ఎస్ రిబెల్స్ కొత్త పార్టీ?
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) చీలిక బాట పట్టుతున్న సూచనలు గోచరిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి హాని కలిగించి తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించారని పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావును తీవ్రంగా విమర్శిస్తూ పలువురు నాయకులు, కార్యకర్తలు పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వారిలో మాజీ ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్ సిలు, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనేక మంది పరాజిత అభ్యర్థులు కూడా ఉన్నారు. ఎన్నికలలో పోటీ చేసే కార్యక్రమమేదీ లేకుండా కొత్త సంస్థను స్థాపించాలని వారు నిర్ణయించుకున్నారు. అయితే, ఇది టిఆర్ఎస్ వ్యతిరేక సంస్థగా ఉండదని వారు స్పష్టం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాన్ని ప్రారంభించడమే కొత్త సంస్థ లక్ష్యం. 'మేము కొత్త పార్టీని నెలకొల్పాలని కోరుకోవడం లేదు. అలా చేస్తే మేము బయటకు వచ్చిన లక్ష్యమే నెరవేరదు. పైగా టిఆర్ఎస్ కు ప్రత్యర్థులం అవుతాం. దానికి బదులు తెలంగాణ కోసం పోరును వీధులలోకి తీసుకువెళ్ళే పద్ధతులను రూపొందించాలని అనుకుంటున్నాం' అని ఒక నాయకుడు తెలియజేశారు.
ఎన్నికలలో టిఆర్ఎస్ పరాజయానికి తెలుగు దేశం పార్టీ (టిడిపి) కారణమని కెసిఆర్ ఆరోపించగా ఆ నాయకులు ఇందుకు టిఆర్ఎస్ అధినేత కూడా నిందార్హుడేనని అంటున్నారు. పార్టీ నాయకత్వం అనుసరించిన విధానాల వల్ల పార్టీ ఒంటరిగా పోటీ చేయడానికి గాని, చివరికి టిడిపి, వామపక్షాల సాహచర్యంలో కూడా వర్ధిల్లడానికి గాని వీలు లేకపోయిందని వారు అభిప్రాయం వెలిబుచ్చారు. 'టిఆర్ఎస్ చరిత్ర ముగిసిందని అనిపిస్తున్నది. ఈ ఉద్యమం పునరుద్ధరణకు ఎన్నికలతో నిమిత్తం లేని కొత్త వ్యూహాన్ని రూపొందించడం అవసరం' అని ఒక నాయకుడు పేర్కొన్నారు.
మూడు రౌండ్ల సంప్రదింపుల అనంతరం ఆ నాయకులు గడచిన రెండు రోజులలో తెలంగాణ సిద్ధాంతకర్తలు ప్రొఫెసర్లు కె. జయశంకర్, కె. కోదండరామ్ లతో సమావేశం అయ్యారు. తెలంగాణ కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించేందుకు ఆ నాయకులకు వారిద్దరూ తమ ఆశీస్సులు అందజేసినట్లు తెలుస్తున్నది. ఈ తిరుగుబాటుకు సారథ్యం వహిస్తున్నవారిలో మాజీ మంత్రి ఎ. చంద్రశేఖర్, మాజీ ఎంఎల్ సి రెహ్మాన్, సిరిసిల్లలో పార్టీ తిరుగుబాటు అభ్యర్థి కె.కె. మహేందర్ రెడ్డి, మాజీ ఎంపిలు చందూలాల్, డి. రవీందర్ నాయక్, పార్టీ మహబూబ్ నగర్ జిల్లా నాయకుడు ఇ. శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 20 May, 2009
|