టిఆర్ఎస్ రిబెల్స్ కొత్త పార్టీ?
తెలంగాణ ఎన్ జిఒ నాయకుడు సి. విఠల్, చకిలం అనిల్ కుమార్, వంటి తెలంగాణ నాయకులు, వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు జె. మార్కండేయ, గుడిమెళ్ళ రవి కుమార్, సహోదర రెడ్డి (ఈ ఇద్దరూ న్యాయవాదులు), కాకిరాల హరిప్రసాద్, గోవింద నాయక్ వంటి పార్టీ సీనియర్ నాయకులు, టిఆర్ఎస్ బిసి విభాగం నాయకుడు జి. అంజయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి కె. చంద్రశేఖర్, ఖమ్మం నుంచి టి. సిద్ధయ్య వంటి నాయకులు పార్టీ నుంచి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
వారితో పాటు పిఆర్పీ నాయకుడు జె. జకరయ్య, తల్లి తెలంగాణ మాజీ నాయకుడు జి. ఇన్నయ్య కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడేందుకు టిఆర్ఎస్ వ్యతిరేక ఫోరమ్ లో చేరేందుకు ఆసక్తి ప్రదర్శించినట్లు తెలుస్తున్నది. 'ప్రత్యేక తెలంగాణ అంశాన్ని పార్లమెంట్ దృష్టికి తీసుకువెళ్ళడంలో టిఆర్ఎస్ కృషి చేసిందనడంలో సందేహం లేదు. కాని పార్టీ ఏర్పడిన ఈ ఎనిమిది సంవత్సరాలలో పార్లమెంట్ లో లాబీయింగ్ దశను దాటి ముందుకు సాగడంలోను, దానికి బాసటగా ప్రజా ఉద్యమం నిర్వహించడంలోను పార్టీ విఫలమైంది. అందుకే ఇప్పుడు ఒక ఉద్యమం చేపట్టవలసిన అగత్యం ఉంది' అని పార్టీలో తిరుగుబాటును సమన్వయపరుస్తున్న ఒక నాయకుడు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' విలేఖరితో చెప్పారు.
ఇది ఇలా ఉండగా, ప్రత్యామ్నాయ తెలంగాణ వేదికను ఏర్పాటు చేయాలని యోచిస్తున్న బృందం తనను సంప్రదించిన విషయం నిజమేనని ప్రొఫెసర్ జయశంకర్ తెలియజేశారు. తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సమస్యలపై సంఘటితంగా ఉద్యమాన్ని లేవదీయడానికి సాగుతున్న ప్రయత్నాల పట్ల జయశంకర్ హర్షం ప్రకటిస్తూ, టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనమేమీ సిద్ధించదని అన్నారు.
రానున్న రోజులలో టిఆర్ఎస్ నుంచి రాజీనామా చేయాలని యోచిస్తున్న నాయకులు త్వరలో సమావేశమై తాము చేపట్టున్న కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.
Pages: -1- 2 News Posted: 20 May, 2009
|