నల్లేరుపై నడక కాదు
కిందపడినా పై చేయి తనదేనంటూ అడ్డంగా వాదించే టిఆర్ఎస్ కు ఈ ఐదేళ్లు కష్టకాలమే. అటు జాతీయ స్థాయిలో దన్ను లేక, ఇటు రాష్ట్ర స్థాయిలో బలం లేక ఉనికి ప్రశ్నార్థకమయిన దుస్థితి. `ఓటు బదిలీ అనేది పనిలేని మీడియా చెప్పేకబ్లురంటూ' తేలిగ్గా కొట్టిపారేసిన కెసిఆర్... రెండు సీట్లతో ఢిల్లీలో తెలంగాణకు ఎలాంటి లాబీ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి. మీడియాను ఎంతవరకు వాడుకోవాలో, ఎప్పుడు దూరంగా వుంచాలో బాగా తెలిసిన కెసిఆర్ పార్టీనే ప్రజలు దూరంగా ఉంచిన వైచిత్రి. బోలెడన్ని ఆశలతో రంగంలోకి దిగిన టిఆర్ ఎస్ తెలంగాణ వాదనలోని బలాన్ని ఈ ఎన్నికలు తేల్చాయి. కేవలం పదిమంది సభ్యులు తెలంగాణ సమస్యలపై ఏ విధంగా పోరాడి, సర్కారు మెడలు వంచుతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటివరకూ లాబీలపైనే ఆధారపడి, ఉద్యమాన్ని అటకెక్కించిన టిఆర్ఎస్ ఈ ఐదేళ్లలో చీలికల నుంచి తప్పించుకుని, క్యాడర్ ను ఏవిధంగా కాపాడుకుంటుందన్న ఆసక్తి గతానుభవాల దృష్ట్యా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో దాదాపు ఒంటరిగా మారిన టిఆర్ఎస్ అసెంబ్లీలో పోషించే పాత్ర కంటే... ప్రజల్లో పోగొట్టుకున్న విశ్వాసాన్ని ఈ ఐదేళ్ళలో తిరిగి ఏ విధంగా పొందుతుందన్నదే ప్రశ్న. ప్రతి పక్షంతో కలసి సర్కారును అడ్డుకోవడానికి లేదు. ఇక చాలాకాలం నుంచి చేస్తున్న `రాజకీయ లాబీ ఉద్యమా'న్ని ప్రజలు విశ్వసించడం లేదు. ఈ పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం ఏమవుతుంది? ఆ ఉద్యమం లేకపోతే టిఆర్ఎస్ ఉనికి ఏమిటన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. పార్టీ స్థాపించిన నాటి నుంచి అంకితభావంతో పనిచేస్తున్న క్యాడర్ ను కాపాడుకోవడమూ కష్టమే.
ఎవరో ఒకరితో పొత్తు వుంటే తప్ప పొద్దుగడవని వామపక్షాలకు ఈ ఐదేళ్లు విషమ పరీక్ష. గత ఐదేళ్ల కాలంలో లెక్కలేనన్ని సార్లు భూపోరాటాలు చేసి, అగ్రనేతలే అరెస్టయి జైళ్లకు వెళ్లినా ఎర్రజెండాలకు నిరుపేదలు ఓట్లురాల్చలేదు. చేసిన భూపోరాటాలూ ఫలించలేదు. పశ్చిమ బెంగాల్ లో ఒక్క సెజ్ పైనే పోరాడి కామ్రేడ్ల కోటలను మమతా బెనర్జీ కుప్పకూల్చగా, రాష్ట్రంలో ఇద్దరు అగ్రనేతలు కలసికట్టుగా ఐదేళ్లు పోరాడినా సర్కారును కదిలించలేకపోయారు. పైగా... ఇద్దరూ కొట్లాడుకుని కాంగ్రెస్ కు లబ్ది కలిగించారు. కమ్యూనిస్టుల కోటలన్నీ బద్దలయిన పరిస్థితి. రానున్న ఐదేళ్లలో మళ్లీ ఉద్యమాలు నిర్మించుకోవాలంటే అంత సులభం కాదు. పోరాటాలకు వెంట వస్తున్న నిరుపేదలు కూడా వాస్తవాలు గ్రహించి `చే'ఎత్తిజేకొట్టారు. అటు అసెంబ్లీలో కూడా సంఖ్యాబలం వేళ్లపై లెక్కించేదే. సిపిఐ 4, సిపిఎం ఒక్క స్థానంతో ఎంతవరకూ నెట్టుకొస్తాయన్నది ప్రశ్న. గతంలో కేంద్రంలో కామ్రేడ్లు బలంగా ఉన్నందున వారిని చూసి భయపడే పరిస్థితి. ఇప్పుడు అదీ లేదు కాబట్టి, వామపక్షాల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.
Pages: -1- 2 -3- News Posted: 21 May, 2009
|