నల్లేరుపై నడక కాదు
ఇక అధికార పీఠాన్ని అధిష్టించిన కాంగ్రెస్ పక్షానికి కూడా ఈ ఐదేళ్ళూ పరీక్షాకాలంగానే భావించాలి. ఆశించినన్ని సీట్లు రాకపోయినా మ్యాజిక్ ఫిగర్ ను మించి సీట్లు సాధించిన కాంగ్రెస్ గత వైఖరిని మార్చుకుని, ఈసారి కొత్త కోణంతో ముందుకు వెళుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో బలహీనమైన ప్రతిపక్షం ఉండటం వల్ల కాంగ్రెస్ కత్తికి ఎదురులేకుండా పోయింది. లెక్కలేనన్ని ఆరోపణలు ఎదుర్కొని కూడా స్థిరంగా నిలబడింది. పైగా అనేకసార్లు ప్రధాన ప్రతిపక్షమైన టిడిపిని ఇరుకునపెట్టి, ఆత్మరక్షణలోకి నెట్టింది. గత ఐదేళ్ళలో ఆ పార్టీ, ముఖ్యంగా వైఎస్ ఎదురుదాడినే నమ్ముకున్నారు. ఈసారి టిడిపి 93 స్థానాలతో అతిపెద్ద ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం నుంచి గట్టి సవాళ్లే ఎదురవుతాయి. అందుకే ఈసారి సర్కారు వ్యవహారశైలిలో మార్పు వుంటుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రుల మాటతీరు, ఉన్నతాధికారుల వ్యవహారశైలి, ఘర్షణ వైఖరి, అనుయాయుల కోసం తీసుకున్న నిర్ణయాలపై విద్యావంతులు, మధ్యతరగతి వర్గాల్లో ఉన్న అసంతృప్తిని ఈ ఐదేళ్ళలో మార్చుకునే ప్రయత్నం చేయక తప్పదు.
కొత్త పార్టీ, కూటమి రంగంలో వున్నప్పటికీ, మీడియా సహకరించకపోయినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ కేవలం పాజిటివ్ ఓటుతోనే గెలిచినందున... ప్రభుత్వం తన భవిష్యత్ కోసం పాత పద్ధతిని విడనాడడం అనివార్యం. గతంలో మంత్రిపదవుల కేటాయింపులో సమర్థతకు కాకుండా, విధేయతకే పెద్ద పీట వేశారు. ఫలితంగా చాలా మంది మంత్రులు తమ సత్తా చాటుకోవడంలో విఫలమయ్యారు. అధికారుల నియామకాలు, పోస్టింగుల విషయాల్లో కూడా చాలా మంది నాన్ సీనియర్స్ అధికారులకు కీలకమైన పోస్టింగులు ఇచ్చినా వారు విఫలమయ్యారు. అలాంటి వారినే అందలం ఎక్కిస్తే మళ్లీ ప్రతిపక్షాలకు పని కల్పించిన వారవుతారు.
Pages: -1- -2- 3 News Posted: 21 May, 2009
|