కేసీఆర్ పై ముప్పేట దాడి
హైదరాబాద్ : ఘోర పరాజయం అనంతరం తెరాసలో ఏర్పడిన ముసలం ముప్పు తెస్తోంది. ఓటమిని జీర్ణించుకోలేని నాయకులంతా అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పైనే ధ్వజమెత్తుతున్నారు. వ్యక్తిగత ఒంటెత్తు పోకడలే పార్టీ పుట్టిముంచాయని ఆరోపిస్తున్నారు. అంతేనా, ఇంకా తెరాసలో కొనసాగితే భవిష్యత్తు వుండదని భావిస్తూ కొంతమంది రాజీనామాలకు సిద్ధపడుతుంటే, మరికొంతమంది పార్టీని చీల్చే యత్నాలు కొనసాగిస్తున్నారు. తమపై సాగుతున్న ముప్పేట దాడిని తట్టుకోలేక తెరాస కీలక నేతలు అజ్ఞాతవాసాన్ని ఎంచుకున్నారు.
మాజీ ఎంపీ రవీంద్రనాయక్ కెసీఆర్ తో బహిరంగలేఖ పేర వ్యక్తిగత విమర్శలతో రాజీనామా పత్రాన్ని పంపించారు. ఆ పార్టీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ నాయకత్వంలో శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సమావేశాన్ని నిర్వహించారు. కేసీఆర్ ఉద్యమాన్ని జాతీయస్థాయిలోకి తీసుకువెళ్ళారు, కాని ప్రత్యేక తెలంగాణ లాబీయింగ్ వల్ల రాదనీ, ఉద్యమం ద్వారానే తెలంగాణ సాధ్యమనీ, ఈ పని తెరాస చేపట్టినా ప్రజలు కేసీఆర్ ను నమ్మే స్థితిలో లేరని దిలీప్ వాదిస్తున్నారు. తెలంగాణ విమోచన సమితి ఏర్పాటుకు ఆయన అంకురార్పణ చేశారు.
తెరాసలో తనకు అనుకూలురైన నాయకులతో ఈ అసమ్మతి, అసంతృప్తి వాదులను బుజ్జగించడానికి కెసిఆర్ నానా తంటాలు పడుతున్నారు. విశ్వశనీయ వర్గాల కథనం ప్రకారం తెరాస అధినేత కేసీఆర్ శుక్రవారం ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ తో చర్చించారు. పార్టీని విడిచి వెళ్ళరాదంటూ అభ్యర్థించారు.కాని దిలీప్ కుమార్ ఈ అభ్యర్థనను పెడచెవిన పెట్టినట్లు సమాచారం. దీనికి ముందు కెసిఆర్ హైదరాబాద్ లోని తన స్వగృహంలో పలువురు పార్టీ ప్రముఖులతో చర్చలు జరిపారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, అసంతృప్తివాదుల కార్యక్రమాలు తదితర అంశాలపై కెసిఆర్ వారితో చర్చించారు. పార్టీ నుండి ఎంపీ విజయశాంతితో పాటు నలుగురైదుగురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తారంటూ వస్తున్న వార్తలు మీడియా సృష్టేననీ, ఇలాంటి ప్రచారం తగ్గించాలని తెరాస నాయకుడు ఈటెల రాజేంద్ర చెప్పారు. పార్టీలో అందరూ ఒకే అభిప్రాయంతో ఉండరనీ, భిన్నాభిప్రాయాలు సహజమనీ, పార్టీ ధిక్కార స్వరాన్ని వినిపించిన దిలీప్ కుమార్, రవీంద్రనాయక్ వంటివారిపై ఎటువంటి క్రమశిక్షణా చర్యలు వుండవని ఈటెల స్పష్టం చేశారు. పార్టీలో అభిప్రాయాలు ఉండడం సహజమనీ, రెండు మూడు రోజుల్లోనే పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశపరచి ఈ అంశాలన్నింటినీ చర్చిస్తామని ఈటెల వెల్లడించారు.
Pages: 1 -2- News Posted: 23 May, 2009
|