కేసీఆర్ పై ముప్పేట దాడి
ఐతే తెరాసను వీడివెళ్ళేందుకే రవీంద్రనాయక్, దిలీప్ కుమార్, చంద్రశేఖర్ వంటి నాయకులు నిర్ణయించుకున్నారనే వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపించడం కెసిఆర్ కు సాధ్యపడదనే అభిప్రాయానికి వచ్చిన వీరు రాజకీయేతర ఉద్యమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. తెరాసను వీడిన నాయకులను, ఇతర పార్టీలలో ఉన్న తెలంగాణ వాదులను, తెలంగాణ ప్రజాసంఘాల నాయకులను ముఖ్యంగా గద్దర్ వంటివారిని కూడా కలుపుకొని ఉద్యమాన్ని నిర్మించాలని వీరంతా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
గద్దర్ కూడా వీరి సూచనపై ఆలోచిస్తానంటూ హామీ ఇచ్చినట్లు సమాచారం. తెరాసను వీడిన వి.ప్రకాశ్, ఇన్నయ్య వంటివారే కాకుండా దేవేందర్ గౌడ్ వెంట వున్న పలువురు నాయకులు కూడా వీరితో జతకట్టేందుకు సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. తెరాసకు ఊపిరినిచ్చిన సాంస్కృతిక విభాగంలో కీలక పాత్ర పోషించిన రసమయి బాలకిషన్ కూడా వీరి వెంట వున్నట్లు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కళల ద్వారా, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా బొందిలో ప్రాణమున్నంతవరకు పోరాడుతానంటూ ప్రకటించారు. దీంతో తెలంగాణ శక్తుల పునరేకీకరణ ప్రయత్నాలు ఉధృతమయ్యాయి. ఇంతకాలం తెలంగాణ ఉద్యామాన్ని తన చెప్పుచేతల్లోనే ఉంచుకోవాలని ప్రయత్నించిన తెరాస అధినేత కేసీఆర్ కు జరిగే పరిణామాలు మింగుడుపడని స్థితికి చేరుకున్నాయి.
తెరాసను ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న కేసీఆర్ దానిని కుటుంబ పార్టీగా మార్చుకున్నాడనేది ప్రధాన ఆరోపణ. మేనల్లుడు హరీష్ రావు చాలా సంవత్సరాలుగా ఉద్యమంలో మమేకమవుతున్నాడనీ, మంచి వక్తగా పేరు గడించిన హరీష్ కు శాసనసభ్యునిగా టిక్కెట్ ఇవ్వడం తప్పు కాకపోయినా కేసీఆర్ తన కుమారుడికి అగ్రతాంబూలం వేయడాన్నితప్పుపడుతున్నారు. సిరిసిల్లలో కెసిఆర్ కు రెబల్ గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన కెకె మహేందర్ రెడ్డి కూడా అసంతృప్తవాదులకు అన్ని సహాయాలు చేసేందుకు సిద్ధంగా వున్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ ప్రణాళికపై కెసిఆర్ కూడా తీవ్రమైన కసరత్తే చేస్తున్నట్లు సమాచారం.
Pages: -1- 2 News Posted: 23 May, 2009
|