మరమ్మతులో నేతలు బిజీ
హైదరాబాద్ : తూట్లు పడిపోయిన నావలు నిండా మునిగిపోకుండా మాట్లు వేసుకోవడంలో పార్టీల నాయకులు తల మునకలై ఉంటే, భుజానికెత్తుకున్న కొత్త కుండే పగిలి పోవడంతో మరో కుండను తయారు చేసుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మెగా పాట్లు పడుతున్నారు. రాజధానిలో రోజువారీ రాజకీయ దృశ్యాలు ఇంతకన్నా భిన్నంగా లేవు. ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ప్రమాణస్వీకరాలతో, మంత్రివర్గం ఎంపికలో, శాఖలో కేటాయింపులతో కళకళలాడుతుంటే, మిగతా రాజకీయ పక్షాలు సమీక్షలు, ఆత్మ విమర్శలు, పరస్పర ఆరోపణలు, ఓటమి కారణాలను కూపీ లాగడం తదితర తతంగాలతో కలవరంగా కాలం గడుపుతున్నాయి.
ఎన్నికల్లో దారుణ పరాజయ పరాభవాన్ని ఎదుర్కొన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోని మొత్తం లోపాలన్నిటినీ స్వయంగా సరిదిద్దాలని సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మించుకురావాలని, దానికి అవసరమైన నాయకత్వ వ్యవస్థను నియమించాలని చిరంజీవి భావిస్తున్నారు. ప్రస్తుత పార్టీ వ్యవస్థలోని అవకతవకలను సరిచేయడం తక్షణ కర్తవ్యంగా చేపట్టనున్నారు. ఇప్పటికే పార్టీని అధికార గమ్యానికి చేర్చలేకపోయినా రైలింజన్ ను వదిలించుకోవడానికి సిద్ధపడ్డారు. ఇక పార్టీ అంతర్గత కార్యకలాపాలు ప్రధానకేంద్రంగా వున్న ఒకటో నెంబరు కార్యాలయాన్ని మూసేసీ కృష్ణానగర్ లో వున్న కార్యాలయాన్ని ఇకపై వినియోగించుకోనున్నారు. అలానే స్వయంగా చిరంజీవి ప్రతిరోజూ ఉదయం పది గంటల నుంచి, సాయంత్రం నాలుగు గంటల నుంచి ఈ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో వుండాలని భావిస్తున్నారు. జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలతో, నాయకులతో ఎప్పటికప్పుడు చర్చించడానికి ఒక ఆహ్వాన కమిటీని, ఒక కార్యక్రమ రూప కల్ప కమిటీని నియమించనున్నారు. మూడు జిల్లాలకు ఒక సీనియర్ నాయకుడ్ని బాధ్యుడుగా నియమించి, ఆ జిల్లాలలోని ప్రజారాజ్యం పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయాలని చిరంజీవి నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి ఎప్పటికప్పుడు కేంద్ర కార్యాలయానికి సమాచారం అందే ఏర్పాటు జరుగుతుంది. ప్రజారాజ్యం పార్టీని పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా తీర్చి దిద్దాలని చిరంజీవి కృత నిశ్చయంతో వున్నారు.
Pages: 1 -2- News Posted: 26 May, 2009
|