మరమ్మతులో నేతలు బిజీ
తాజా ఎన్నికలలో ఓటమి తెరాసలో ముసలం పుట్టించింది. కళ్లముందే ముక్క చెక్కలై పోతున్న తెరాసను చూసి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర స్థాయిలో కలవర పడుతున్నారు. తెరాస ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఇంకా అనేక మంది అనుచర సహచరులు తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ఆయనలో అయోమయాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ధిక్కార ధోరణిపై కన్నెర్ర జేస్తున్నప్పటికీ కేసీఆర్ వైఖరిలో బేలతనం స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ మద్దతు దారులతో, మేధావులతో ఒక రాజకీయేతర ఉద్యమ సంస్థను స్థాపించాలన్న దిలీప్ కుమార్ ప్రయత్నాలు విజయవంతం అయితే తెలంగాణలో తెరాసకు గడ్డుకాలం తప్పదని పరిశీలకుల అంచనా.
గడిచిన ఎనిదేళ్ళ కాలంలో ఇలాంటి అసమ్మతి జ్వాలలను కేసీఆర్ ఎదుర్కొంటూనే వున్నారు. కాని, అప్పట్లో ఆయన వాటిని సునాయాసంగా అధిగమించగలిగారు. ఎన్నికల్లో ఓటమితో ఇప్పటికే కార్యకర్తల వ్యవస్థ కుదేలైపోయి వుంది. ఇలాంటి తరుణంలో అసమ్మతి వేరు కుంపట్లు పెడితే పరిణామాలను తట్టుకోవడం కష్టమని కేసీఆర్ భావిస్తున్నారు. తెరాసను ఏర్పాటు చేసినప్పుడు కూడా వున్న నారాయణ్ రెడ్డి, సమరసింహారెడ్డి, సంతోష్ రెడ్డి, ఆలే నరేంద్ర వంటి ఉద్దండులు పార్టీని వదిలిపోయినప్పుడు కూడా ఆయన అంత కంగారు పడలేదు. కాని 2008 ఉప ఎన్నికల అనంతరం తెరాస తెలంగాణలో తన ప్రాభవాన్ని చాలా వేగంగా కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు అది మరింత దిగజారిపోయింది. తెరాసను ప్రజల్లో వుంచడానికి ఇప్పుడు కేసీఆర్ పార్టీలోకి వచ్చిన కొత్త తార మెదక్ ఎంపి విజయశాంతిని ప్రయోగిస్తున్నారు. పార్టీపై అన్నివైపుల నుంచీ వస్తున్న దాడులను తట్టుకోవడానికి కేసిఆర్ తన సహచరుడు ఈటెల రాజేంద్రను వినియోగిస్తున్నారు. ఏమైనా రాబోయే కష్టకాలాన్ని అధిగమించటానికి కేసీఆర్ తంటాలు పడుతున్నారు.
అతి పెద్ద ప్రతిపక్షంగా అవతరించినా, అధికారానికి అడుగు దూరంలో ఆగిపోయిన తెలుగుదేశం బాధలు వర్ణనాతీతంగా కనిపిస్తున్నాయి. అనూహ్య పరాజయంతో చంద్రబాబు నాయకత్వ పటిమమీదే అనుమానాలు తలెత్తే పరిస్థితులు దాపురించాయి. ఎన్నికల్లో పుట్టి ముంచిన తెలంగాణ నినాదానికి దూరంగా వుండాలని చంద్రబాబు తాజా నిర్ణయం. లేకపోతే పార్టీ మనుగడ పూర్తిగా దెబ్బతినిపోగలదన్న ఆందోళన ఆయనను వేధిస్తోంది. మహాకూటమిలో మిత్రపక్షమైన తెరాస ఫలితాలు రాకుండానే జెండా ఎత్తేయడంతో చంద్రబాబు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ అంశంపై తెలంగాణ అనుకూల శక్తులన్నీ ఏకమవడం చంద్రబాబును ఆలోచనల్లో పడేసింది. అలానే గతంలోలా కాంగ్రెస్ పై అయినదానికీ కానిదానికీ విరుచుపడరాదనీ, ప్రభుత్వం తప్పులు చేసే వరకూ వేచి చూడాలని చంద్రబాబు నిర్ణయించారు.
Pages: -1- 2 News Posted: 26 May, 2009
|