విధేయతకే పట్టం
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఈసారి తన మంత్రి వర్గాన్ని పూర్తిగా విధేయులతో నింపేశారు. అధినేత్రి తనకిచ్చిన అధికారాలను వినియోగించుకున్నారు. గతంలో ఈసారి మంత్రి వర్గంలో 10-జనపథ్, సిడబ్ల్యుసి, ఏఐసిసి కోటాలు లేకండా పూర్తిగా తన మార్కు ప్రదర్శించారు. తన వారసుడి రాజకీయ భవితవ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వైఎస్ మంత్రి వర్గ కూర్పు చేసినట్లు కనిపిస్తోంది. గతంలో పనిచేసిన 14 మంది మంత్రులు ఓడిపోవడంతో 20 మంది కొత్తవారిని మంత్రివర్గంలో తీసుకున్నారు. వారిలో అంతా వైఎస్ విధేయులే. వివాదస్పదుడిగా మారినందుకే జెసి దివాకర్ రెడ్డిని తీసుకోలేదని చెబుతున్నా, రాయలసీమలో తన వారసుడి భవిష్యత్ రాజకీయాలను సుగమం చేయడానికేనన్న వ్యాఖ్యలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
ఇక కాసు కృష్ణారెడ్డిని తొలగించడం ద్వారా తనవారయినా శాఖలపై పట్టులేని వారికి మంత్రి పదవులు శాశ్వతం కాదన్న సంకేతాలు పంపారు. జానారెడ్డిని తీసుకోక పోవడం ద్వారా కొత్త మంత్రులు స్వతంత్రంగా వ్యవహరించడం, సొంత అభిప్రాయాలు వ్యక్తం చేస్తే కష్టాలు తప్పవన్న సందేశాన్నీ పరోక్షంగా పంపించారు. గతంలో మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డికి స్థానం లభించలేదు. తనను కాదని ఢిల్లీకి వెళ్ళి మరీ టికెట్ సాధించుకున్న కుతూహలమ్మకు మంత్రి పదవి రాకుండా చెక్ పెట్టారు. తనను దాటి వెళ్లే వారికి ఎలాంటి చేదు అనుభవం ఎదురవుతుందో వైఎస్ చేతల్లో చెప్పకనే చెప్పారు. కొత్తగా తీసుకున్న వారిలో యువకులే ఎక్కువగా వుండటం పరిశీలిస్తే, వైఎస్, ఆయన వారసుడి రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుందన్నది చెప్పకనే చెప్పినట్టయింది.
కొత్తగా మంత్రివర్గంలో పదవులు పొందిన వారిని పరిశీలిస్తే కష్టపడి పనిచేయడం ఒక్కటే కాకుండా వారంతా వైఎస్ కు విధేయులుగా ఉండటమే వారి అర్హతకు ప్రాతిపదికగా స్పష్టమవుతోంది. మిగిలిన వారిలో కూడా కష్టపడే మనస్తత్వం వున్నా, తన పట్ల ఉన్న విధేయతనే వైఎస్ ప్రాతిపదికగా తీసుకున్నారు. సీనియర్ నేత రోశయ్యకు సమర్థత, విధేయత రెండూ కలసి వచ్చాయి. ఇక ఐదేళ్ల పాటు వైఎస్ సర్కారును దుయ్యబట్టిన `ఈనాడు' పై ఎదురు దాడి చేసి, సిఎంకు బాసటగా నిలిచిందుకే వట్టి వసంతకుమార్ కు మంత్రి పదవి బహుమతిగా లభించింది. మాణిక్య వరప్రసాద్ కూడా గతంలో విపక్షాలపై ఎదురుదాడి చేసి వైఎస్ పెదవులపై చిరునవ్వులు పూయించారు. గతంలోనే మంత్రి పదవి కోసం ప్రయత్నించిన వైఎస్ బంధువు బాలినేని కల ఈసారికి ఫలించింది. 2004లో ఆయనను మంత్రి వర్గంలో తీసుకునేందుకు సంశయించిన వైఎస్ ఈసారి నిర్భయంగా నిర్ణయం తీసుకున్నారు. గీతారెడ్డి, రాజనర్శింహ, సునీతా లక్ష్మారెడ్డి ముగ్గురూ వైఎస్ కు విధేయులే.
Pages: 1 -2- News Posted: 26 May, 2009
|