విధేయతకే పట్టం
చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డితో పాటు, తాను అభిమానించే కొండా సురేఖ ఆ మధ్యలో తనపై అలిగినా వారు తనపై చూపిన విధేయతనే వైఎస్ ప్రాతిపదికగా తీసుకున్నారు. వెన్నంటి ఉండే మిత్రుడు రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పొన్నాల, ఆనం రామనారాయణ రెడ్డి, మోపిదేవి వెంకట రమణ, జూపల్లి కృష్ణారావు, దానం నాగేందర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణకు విధేయత ప్రాతిపదికనే మంత్రి పదవులు వచ్చినట్లు కనిపిస్తోంది. ధర్మాన, బొత్స, కన్నా, పొన్నాల, గాదె, శ్రీధర్ బాబుకు విధేయతతో పాటు సమర్థత కూడా ప్లస్ పాయింటుగా మారింది.
స్పీకర్ గా ఖరారయిన కిరణ్ కుమార్ రెడ్డి కూడా విధేయత ప్రాతిపదికనే ఆ పదవికి ఎంపికయ్యారు. చాలాకాలం నుంచి విపక్షంలో ఉన్న కిరణ్ కుమార్ ఆ పార్టీకి ఒక ఆయుధంగా మారారు. చివరకు అధికారంలోకి వచ్చినా, ప్రతిపక్షాలపై ముఖ్యంగా టిడిపిపై ఎదురుదాడి సమయంలో వైశ్ ఆయననే అస్త్రంగా ఎంచుకున్నారు. చంద్రబాబు హెరిటేజ్ వ్యవహారాన్ని సభలో ప్రస్తావించింది కిరణ్ కుమార్ రెడ్డే కావడం గమనార్హం. ఇక నాదెండ్ల మనోహర్ డిప్యూటీ స్పీకర్ ఎంపికలో పిసిసి అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సిఫారసు వుందంటున్నారు. దానితో పాటు ప్యానెల్ స్పీకర్ గా పనిచేసిన సమయంలో విపక్షాల్ని సమర్థవంతంగా ఎదుర్కొని, సభ నిర్వహించడం నాదెండ్లకు కలసి వచ్చింది. అయితే, సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఓడించడానికి కృషి చేశారంటూ ఫిర్యాదులున్న రామచంద్రారెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవడమే అర్థం కాకుండా వుంది.
తన మైండ్ సెట్ కు తగ్గట్టు వ్యవహరించేవారికే అందలం దక్కుతుందన్న సంకేతాలను వైఎస్ మంత్రి వర్గం కూర్పుతో చాటి చెప్పారు. పార్టీ అధిష్టానం కూడా వైఎస్ కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇక ఢిల్లీ దారులు దాదాపు మూసుకుపోయినట్లే. ఈ కారణంతోనే కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో స్థానం కోసం ప్రయత్నించిన ఎమ్మెల్యేలు, ఎంపిలు మునుపటి మాదిరిగా ఏఐసిసి, సిడబ్ల్యుసి నేతల చుట్టూ తిరగకుండా ఆంధ్రభవన్ లో ఉన్న వైఎస్ చుట్టూనే తిరగడం గమనార్హం.
Pages: -1- 2 News Posted: 26 May, 2009
|