లెఫ్ట్ బాటలో తృణమూల్!
కోలకతా : కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వాన్ని వామపక్ష ఫ్రంట్ ఆర్థిక విధానాలు వెంటాడుతూనే ఉండవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తాజాగా పెద్ద మిత్ర పక్షమైన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ రంగంలోని బీమా సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను, లాభాలతో నడిచే ప్రభుత్వం రంగ సంస్థ (పిఎస్ యు)లలో వ్యూహాత్మక అమ్మకాలను, రీటైల్ రంగంలోకి భారీ పెట్టుబడి సంస్థల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నది.
ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను లేదా లాభసాటి పిఎస్ యులలో వ్యూహాత్మక అమ్మకాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ (టిసి) నాయకుడు పార్థా చటర్జీ తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ లో రీటైల్ రంగంలో భారీ పెట్టుబడి సంస్థల ప్రవేశానికి వ్యతిరేకంగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్న టిసి రీటైల్ రంగంలో దేశీయ లేదా విదేశీ పెట్టుబడి సంస్థల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తామని తన ఎన్నికల ప్రణాళికలో కూడా పేర్కొన్నది.
మెజారిటీ వాటాలు ఆర్థిక సంస్థల అధీనంలో ఉన్న పిఎస్ యులలో పెట్టుబడుల ఉపసంహరణకు తమ పార్టీ అభ్యంతరం లేవదీయదని చటర్జీ తెలిపారు. అయితే, మెజారిటీ వాటాలు ప్రభుత్వం అధీనంలో ఉన్న పిఎస్ యులో పెట్టుబడుల ఉపసంహరణను టిసి వ్యతిరేకిస్తున్నదని ఆయన తెలిపారు.
పశ్చిమ బెంగాల్ లో ఇంతకుముందు యుపిఎ ప్రభుత్వం హయాంలో భారీ పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆండ్రూ యూలె అనుబంధ సంస్థలైన డిపిఎస్ సి, టైడ్ వాటర్ ఆయిల్ (ఇండియా), ఫీనిక్స్ యూలె సంస్థలలో వాటాల అమ్మకానికి అనుమతి ఇచ్చింది. 'అప్పటికే అనుమతి ఇచ్చిన సంస్థ విషయంలో మేము ఏమీ చేయజాలం' అని చటర్జీ చెప్పారు.
Pages: 1 -2- News Posted: 26 May, 2009
|