మంత్రులకు కత్తిమీద సాము
హైదరాబాద్ : రాష్ట్ర కొత్త హోం మంత్రిగా నియమితులైన సబితా ఇంద్రారెడ్డికి బాధ్యతల నిర్వహణ కత్తిమీద సాములా ఉండే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. రాష్ట్రంలో ఇదివరకటితో పోలిస్తే ఒక్క శాంతి భద్రతల అంశం మినహా తీవ్రవాదం, ఉగ్రవాదం నివురుగప్పిన నిప్పులా ఉండడం, వైట్ కాలర్ క్రైం, సైబర్ నేరాలు వెర్రి తలలు వేస్తుండడం, సీమలో ఫ్యాక్షన్ భూతం అక్కడి ప్రజలను నీడలా వెంటాడుతుండడం వంటి అంశాలు కొత్త హోం మంత్రికి సరికొత్త సవాల్ గా మారనున్నాయి. హైదరాబాద్ లోని సైదాబాద్ లో గత డిసెంబర్ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన పోలీసులపై ఐఎస్ఐ ఉగ్రవాదులు కాల్పులు జరిపి గాయపరచడం, ఫలక్ నుమాలో వారం రోజుల క్రితం ఓ హోంగార్డును కాల్చి చంపి, ఇంకో కానిస్టేబుల్ ను గాయపరచడం ఉగ్రవాదుల సైలెంట్ ఆపరేషన్లకు ఉదాహరణగా చెప్పాలి. రెండేళ్ల క్రితం మక్కా మసీదులో సంభవించిన పేలుడు కేసుపై ఇప్పటి వరకు ఊసే లేకపోవడం ఇందుకు నిదర్శనం.
ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న రాయలసీమలో ఫ్యాక్షన్ భూతం ప్రజలను నేటికీ వణికిస్తోంది. ఇక్కడ ఫ్యాక్షన్ గొడవలు గతంలో కంటే తగ్గినా హత్యాకాండలు మాత్రం యధేచ్చగా కొనసాగుతూనే వున్నాయి. తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా ఇటీవల జరిగిన గొడవలు, అంతకు ముందు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు ఆయన అనుచరుల హత్యాకాండ ఇందుకు నిదర్శనం. ఇదంతా ఒక ఎత్తయితే పోలీసు శాఖలో ఐపిఎస్, నాన్ ఐపిఎస్ అధికారుల మధ్య కొనసాగుతున్న అంటరానితనం మరో ఎత్తు. పోలీసు శాఖలో ఈ రెండు వర్గాల మధ్య చాలా కాలంగా మంచి సంబంధాలు లేవనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఇది మరింత పెరిగింది. దీనికి తోడుగా ఉత్తరాది అధికారులు దక్షిణాది అధికారులపై పెత్తనం సాగించడం కూడా ఇటీవల బాగా పెరిగింది. దినేష్ రెడ్డి లాంటి ఒకరిద్దరు అధికారులు దీనిపై గళమెత్తినా సర్కారులో చలనం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దీని ప్రభావం మొత్తం పోలీసు శాఖపైనే పడే అవకాశాలు లేకపోలేదు. ఈ అంశాలన్నీ కొత్త హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సవాల్ గానే చెప్పాలి. గతంలో ఇదే శాఖలో ఆమె భర్త దివంగత ఇంద్రారెడ్డి కొంత కాలం పనిచేయడం ఈ సందర్భంగా గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న వ్యాధులు, వైద్యుల కొరత, వసతుల లేమి కొత్త మంత్రులకు సవాల్ గా మారనుంది. ఆసుపత్రుల్లో సిబ్బంది, మందుల కొరత వంటి వాటిని అధిగమించి వైద్య సేవలను మెరుగుపర్చాల్సిన అవసరం వుంది. వైద్య, ఆరోగ్యశాఖకు కేటాయిస్తున్న మూడువేల కోట్ల బడ్జెట్ ఏ మూలకూ సరిపోకపోవడంతో ప్రజలు వైద్యం కోసం అల్లాడుతున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీతో పేదల దరికి ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా, చిన్నా, చితకా వైద్యసేవలు వారికి మృగ్యమవుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ఆసక్తి చూపకపోవడంతో అక్కడ చాలా పోస్టులు ఇప్పటికీ ఖాళీగా వున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లక్ష జనాభాకు 61 మంది వైద్యులు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. జనాభాలో 70 శాతం ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కేవలం పదిశాతం మంది డాక్టర్లు అందుబాటులో వుండగా, పట్టణ ప్రాంతాల్లో 90 శాతం మంది వైద్యులు వున్నారు. గతంలో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి లక్షమంది జనాభాకు ఒక గైనకాలజిస్ట్, అనస్థీషియన్, పీడియాట్రీషియన్ ఉండాలని ప్రతిపాదించినా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి వుంది. పీజీ పూర్తి చేసిన డాక్టర్లు తప్పనిసరిగా రెండు నుంచి మూడు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలన్న నిబంధన విధించడం వంటి నియమాలు కూడా సక్రమంగా అమలుకాకపోవడంతో ప్రాధమిక వైద్యం అగమ్యగోచరంగా మారుతోంది. ఈ నేపధ్యంలో ముగ్గురు మంత్రులు ప్రజారోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం వుంది.
Pages: 1 -2- News Posted: 27 May, 2009
|