మంత్రులకు కత్తిమీద సాము
పౌర సరఫరాల శాఖ! పాలనాయంత్రాంగంలో ఇదొక కీలక విభాగం. రెండోసారి ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకం ఈ శాఖకు సంబంధించిందే. పేదోడి అయిదు వేళ్లూ నోట్లోకి వెళ్లాంటే సదరు మంత్రిత్వశాఖ సమర్థవంతంగా పనిచేయాల్సి వుంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా... దాని వ్యతిరేక ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది. ఒకవంక చౌక దుకాణాల పనితీరును పర్యవేక్షిస్తూ... మరో వంక మార్కెట్ మాఫియాకు కళ్లెం వేయాల్సిన బాధ్యత ఈ శాఖదే. కొత్తగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న కిలో రూ.2 బియ్యం పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఆయనపై వుంది. దీనిపై ప్రభుత్వం ఏటా 600 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీని భరిస్తోంది. తెల్లరేషన్ కార్డు గల కుటుంబానికి సగటు బియ్యాన్ని 20 నుంచి 30 కిలోలకు పెంచుతూ ముఖ్యమంత్రి తొలి సంతకం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న కోటా అంతంత మాత్రమే ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి లబ్దిదారునికీ 30 కిలోల బియ్యం ఠంచనుగా అందజేయడం అంత సులువు కాదు. ప్రజాపంపిణీ వ్యవస్థను పట్టాలెక్కించడంతో పాటు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి మంత్రి కఠిన చర్యలు తీసుకోక తప్పదు. గిడ్డంగుల్లో మూలుగుతున్నబియ్యాన్ని మార్కెట్లోకి విడుదల చేయడానికి విస్తృతంగా దాడులు చేయాల్సి వుంటుంది.
ప్రజలపై ఎటువంటి పన్నులు వేయకుండా, భారం మోపకుండా జులై చివరి వారంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడతామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ నాయకత్వంలో రెండో సారి ఆర్థిక శాఖను చేపట్టిన ఆయన మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. గడిచిన ఐదేళ్లలో కొత్తపన్నులు వేయకుండా, ప్రజలపై ఎలాంటి భారం వేయకుండా, కొన్నింటిపై పన్నులు తగ్గించామని ఇందుకు సహకరించిన అధికారులను ఆయన అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా పెనుప్రభావాన్ని చూపుతున్న ఆర్థిక మాంధ్యం మన దేశంలో, రాష్ట్రంలో పెద్దగా ప్రభావం చూపకోవడానికి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి డాక్టర్ చిదంబరం తీసుకున్న చర్యలేనని మంత్రి రోశయ్య వివరించారు. రాష్ట్ర ఆదాయాలు తగ్గిన మాట వాస్తవమేనని అంగీకరించిన ఆయన ఈ ఒక్క సంవత్సరంలో కొంచెం సర్దుకు పోవాల్సి వుంటుందని పేర్కొన్నారు. ఆదాయాలు ఉన్నంతలోనే ఖర్చులను నియంత్రించుకోవాలనే తత్వం తనదని, అప్పులు చేయడం తనకు ఇష్టం వుండదని తేల్చిచెప్పారు. మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోశయ్యను ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు అభినందించారు.
Pages: -1- 2 News Posted: 27 May, 2009
|