తగ్గిన ఉత్తరాది పట్టు
మంత్రివర్గం కూర్పులో ఉత్తరాదికి అంత ప్రాధాన్యం లేకపోయినప్పటికీ ఒక ఉత్తరాది రాష్ట్రం నేత పరోక్షంగా విశిష్ట పాత్ర పోషించారు. బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) అధ్యక్షురాలు మాయావతి ప్రభావం ఎన్నికలలో కనిపించి ఉండకపోవచ్చు. కాని ఆమె ప్రాముఖ్యం మాత్రం తగ్గలేదని గ్రహించిన కాంగ్రెస్ పలువురు దళితులను మంత్రివర్గంలోకి తీసుకున్నది.
మొదటి రౌండ్ లో మంత్రివర్గంలో చేర్చుకున్న సుశీల్ కుమార్ షిండే, మీరా కుమార్ లను 'నామమాత్ర' ప్రతినిధులుగా పేర్కొన్నారు. అయితే, మల్లికార్జున్ ఖర్గె, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా, కృష్ణ తీరథ్ లను క్యాబినెట్ మంత్రులుగా, స్వతంత్ర బాధ్యతలు గల సహాయ మంత్రులుగా చేర్చుకోవడాన్ని బట్టి దళితులలో పట్టును తిరిగి సంపాదించే వ్యూహంలో భాగమే ఇదని నిర్ధారణ అవుతున్నది. ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో తన దళిత ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ బిఎస్ పి, ఆర్ జెడి, ఎల్ జెపిలకు వదలుకున్నది కదా.
బీహార్ లో పెరిగిన కాంగ్రెస్ ఓట్ల వాటా సీట్ల సంఖ్యను పెంచకపోయినా ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో మెరుగైన ఫలితాలు సాధించినందున అగ్ర వర్ణాల, ముస్లిం వోట్లను తిరిగి సమీకరించగలమని కాంగ్రెస్ నమ్మకంతో ఉన్నది. అందుకే ఉత్తరాది నుంచి క్యాబినెట్ లో ముస్లింలు ఎవరూ లేకపోవడం కాంగ్రెస్ నాయకులు కొందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ముస్లిం ఎంపిలలో కనీసం ఒకరు లేదా ఇద్దరు క్యాబినెట్ లో చోటు చేసుకోగలరని ఆ నాయకులు ఆశించారు.
మంత్రి మండలిలోని ఐదుగురు ముస్లిం మంత్రులలో కేవలం ఇద్దరు గులాం నబీ అజాద్, సల్మాన్ ఖుర్షీద్ కాంగ్రెస్ వారు. మిగిలిన ముగ్గురూ - ఫరూఖ్ అబ్దుల్లా, ఇ. అహ్మద్, సుల్తాన్ అహ్మద్ వరుసగా నేషనల్ కాన్ఫరెన్స్, ముస్లిం లీగ్ (కేరళ), తృణమూల్ కాంగ్రెస్ పార్టీలకు చెందినవారు. అజాద్ ఒక్కరే కాంగ్రెస్ కు చెందిన ఏకైక ముస్లిం క్యాబినెట్ మంత్రి.
మే 16న బిజెపి కన్నా కాంగ్రెస్ ముందంజలో ఉన్నప్పుడు ఈ పార్టీ విజయంలో ముస్లింలు పెద్ద పాత్ర పోషించారని అంతా అభిప్రాయపడ్డారు. జమాత్ - ఎ - ఇస్లామీ హింద్, మత, భాషాపరమైన మైనారిటీల సంఘంతో సహా ఆరు ముస్లిం సంస్థలు మే 26న ఇదే విషయాన్ని ఒక పత్రంలో ప్రధానంగా ప్రస్తావించాయి. ఢిల్లీ వార్తా పత్రికలలో ప్రచురించిన, సోనియాకు, ప్రధానికి చేసిన విజ్ఞప్తిలో ఆ సంస్థల నాయకులు 'న్యాయమైన ప్రాతినిధ్య సూత్రం' ప్రాతిపదికగాను, ముస్లింలకు సాధికారత కల్పన ఆవశ్యకత దృష్ట్యాను కనీసం 11మంది మంత్రులను నియమించాలని కోరారు.
Pages: -1- 2 -3- News Posted: 28 May, 2009
|