అదృష్టం వరించేనా?
హైదరాబాద్ : ఐదేళ్ళ ఎన్ని`కల'లకు పాపం ఆదిలోనే హంసపాదు పడింది. టిక్కట్టే రాలేదు. కొంతమందికి టిక్కెట్టు వచ్చినా జనం ఓటు వేయలేదు. మరికొంత మందికి జనం ఓటేసి గెలిపించినా ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇవ్వలేదు. అదిగో అలాంటి సగం నష్టజాతకులకీ, అదృష్టలక్ష్మి అకస్మాత్తుగా మొహం చాటేసిన వాళ్ళకీ వర ప్రసాదాలు పంచి పెట్టడానికి కాంగ్రెస్ పళ్లెరాన్ని సిద్ధం చేస్తోంది. కేబినెట్ హోదా మంత్రి పదవుకంటే ఆకర్షణీయమైన, ఆనందకరమైన పదవులను పొందటానికి రాష్ట్రంలోని వేలాది మంది కాంగ్రెస్ నిరుద్యోగులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని పదవులకు బల్బుకారు సౌకర్యంకూడా ఉండడంతో సీనియర్లు సైతం అధిష్టానం వెంట పడుతున్నారు.
గత మూడేళ్ళ నుంచి ఖాళీగా వున్న ఈ పదవులను ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన క్యాడర్ కు ఇవ్వాలని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపర్చకూడదనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది. పదవులు ఇచ్చేది ముఖ్యమంత్రి వైఎస్సే అయినప్పటికీ, పార్టీ వైపు నుంచి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఇందుకోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టారు. బహుశా జూన్ లేదా జూలై నెలలో తొలి విడత నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు వంటి నామినేటెడ్ పోస్టులను అతి త్వరలో భర్తీ చేస్తామని తాజాగా డిఎస్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.
రాష్ట్ర స్థాయిలో సుమారు 36 కార్పోరేషన్లకు చైర్మన్ పదవులు వున్నాయి. ఇవి కాకుండా ఆయా కార్పోరేషన్లలో కనీసం ఏడు నుంచి 15 మంది వరకు డైరెక్టర్లు నియమించే అవకాశాలుంటాయి. ఇవి కాకుండా జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీలు, వ్యవసాయ కమిటీలు, డిసిసిబి చైర్మన్లు, డైరెక్టర్లు, వివిధ సంస్థల ప్రాంతీయ, జిల్లా స్థాయి కమిటీలకు చైర్మన్లు, సభ్యుల పదవులు వుంటాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ తమ నేతలను, కార్యర్తలతో ఈ పదవులను భర్తీ చేయడం సంప్రదాయంగా వస్తున్నది. కాగా తొమ్మిదేళ్ళ విరామం తరువాత 2004లో కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు చాలా మంది పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలి విడతలో నాడు తన వర్గీయులు, సన్నిహితులకే ఈ పదవులు ఇచ్చారు. పార్టీలో మిగతా నేతలకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. రెండేళ్ళ అనంతరం వారి కాలపరిమితి ముగిసిన తరువాత వైఎస్ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయలేదు. దాదాపు మూడు సంవత్సరాలకు పైగా ఈ పోస్టులను ఆయన ఖాళీగా ఉంచారు. పార్టీ సీనియర్ నేత వి.హన్మంతరావుతో పాటు పలువురు ఇందుకు నిరసన తెలియజేస్తూ సిఎం వైఖరిపై అప్పట్లో విమర్శలు కురిపించారు.
Pages: 1 -2- News Posted: 29 May, 2009
|