టాటా చెక్కు మమత వాపసు
కోలకతా : టాటాల నుంచి రూ. 28 లక్షల ఎన్నికల విరాళాన్ని 'వెంటనే తిప్పిపంపాల'ని తృణమూల్ కాంగ్రెస్ (టిసి) నాయకులను మమతా బెనర్జీ ఆదేశించారు. 'దీదీ అమితాగ్రహం చెందారు. చెక్కును వెంటనే వాపసు చేయాలని ముకుల్ (రాయ్)ను ఆమె కోరారు. నానో నిష్క్రమణకు కారకురాలని తనను నిందించిన సంస్థ తృణమూల్ కాంగ్రెస్ కు డబ్బు ఇవ్వజూపడం ఆమెకు బాగా కోపం తెప్పించింది' అని ఢిల్లీ నుంచి పార్టీ ఎంపి ఒకరు తెలియజేశారు.
తృణమూల్ 'ఏ సంస్థ నుంచి కూడా ఈ రీతిలో డబ్బు స్వీకరించదు' అని తెలియజేస్తూ తాను టాటా సంస్థకు లేఖ పంపినట్లు ముకుల్ రాయ్ వెల్లడించారు. చెక్కు 'మంగళవారం (26న)' వచ్చిందని ఆయన చెప్పారు. 'మా పార్టీ చక్కని ఫలితాలు సాధించినందుకు చెక్కు పంపారు' అని ఆయన తెలిపారు.
కాగా, తృణమూల్ కు విరాళం పంపినట్లు టాటా సంస్థ ధ్రువీకరించింది. 'ఆ డబ్బును మమతా బెనర్జీకి ఆఫర్ చేయడమైనది. అయితే, టాటా సంస్థ డబ్బు పంచదనే సంగతి గుర్తించండి. తన నియమావళిలో నిర్దేశించిన అర్హతలకు సరిపోయే ఏ పార్టీకైనా టాటా ఎలక్టొరల్ ట్రస్ట్ డబ్బు ఇవ్వజూపుతుంది' అని ముంబైలో టాటా సంస్థ అధికార ప్రతినిధి ఒకరు వివరించారు.
ఎన్నికలకు నిధులు సమకూర్చడంలో పారదర్శకత తీసుకువచ్చేందుకు దేశంలోని తొలి కార్పొరేట్ యత్నాలలో భాగంగా 1996లో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ కు టాటా సంస్థలు డబ్బు అందజేస్తుంటాయి. అయితే, ఆ నిధుల పంపిణీలో వాటి మాటకు ప్రాధాన్యం ఏమాత్రం ఉండదు. పార్లమెంట్ లో పార్టీలకు గల సీట్ల నిష్పత్తిలో ఎన్నికలకు ముందు తన కార్పస్ నిధిలో 50 శాతాన్ని ట్రస్ట్ పంపిణీ చేస్తుంది. తక్కిన మొత్తాన్ని ఎన్నికల అనంతరం అవి గెలుచుకున్న సీట్ల దామాషా ప్ర కారం అందజేస్తుంది. ఎన్నికల అనంతరం తృణమూల్ కు నిధులు అందాయంటే, ఆ పార్టీ అర్హత పొంది ఉండకపోవచ్చు లేదా గత లోక్ సభలో ఆ పార్టీకి తగినంత మంది ఎంపిలు ఉండి ఉండకపోవచ్చు. గత లోక్ సభలో మమత ఒక్కరే తృణమూల్ ఎంపిగా ఉన్నారు.
Pages: 1 -2- News Posted: 29 May, 2009
|