వ్యక్తి`గతం'పై నిఘా
హైదరాబాద్ : మంత్రుల దగ్గర మంత్రాంగం నెరపే వ్యక్తిగత యంత్రాంగాన్ని తయారుచేయడంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. వ్యకిత్గత కార్యదర్శులు, వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత పౌరసంబంధ అధికారుల నియామకంలో మంత్రులు జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి వైఎస్ స్వయంగా హెచ్చరించడంతో పాత కాపుల మొహాలు వెలవెలబోతున్నాయి. మంత్రుల దగ్గర ప్రత్యేక కొలువులకు అలవాటు పడిపోయిన కోటరీ సిబ్బందికి కొత్త ఇబ్బందులు వచ్చిపడ్డాయి. మహా ముదుర్లైన కొంత మంది మాత్రం ధీమాతోటే ఉన్నారని వినికిడి. అయినప్పటికీ గత ఐదేళ్ళ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రుల వ్యక్తిగత సిబ్బంది నియామకం పూర్తిగా ఆయా మంత్రుల ఇష్టాయిష్టాలకే వదిలేయకుండా కాస్త తమ జోక్యం కూడా ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం నిర్ణయించింది. మంత్రుల దగ్గర ఈ కొలువుల్లో చేరే వ్యక్తులు తప్పనిసరిగా కాంగ్రెస్ కు విధేయులై ఉండాలన్నది మొదటి సూత్రం. గతంలో ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీలకు ఏ విధంగానూ సన్నిహితంగా ఉండి ఉండకూడదన్నది రెండో సూత్రం.
ఈసారి ప్రతిపక్షం చాలా బలంగా ఉన్న నేపధ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గతంలో చాలా కీలకమైన ప్రభుత్వ పత్రాలు, ఈ మంత్రుల వ్యక్తిగత సిబ్బంది ద్వారానే ప్రత్యర్థులకు అందాయన్నది ఆయన దగ్గర ఉన్న సమాచారం. అప్పట్లో కాంగ్రెస్ తిరుగులేని ఆధిక్యతలో ఉంది కాబట్టి నోరేసుకుని నెగ్గుకొచ్చేసింది. ఈసారి అలాంటి అవకాశం ప్రతిపక్షాలకు దొరికితే అధికార పక్షానికి కాసుకోవడం కష్టమే అవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా ఆలోచించి ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి తావులేకుండా ఈ నియామకాలు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశాలు చెబుతున్నాయి. కాబట్టే అమాత్యుల అంతరంగికులపై నిఘా మొదలైంది. కోటరీలోని వ్యక్తుల సచ్ఛీలతకు శల్య పరీక్ష చేస్తున్నారు. వ్యక్తిగత కార్యదర్శులకు నిఘా వర్గాల సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధన విధించారు. ఇందుకు విరుద్ధంగా వ్యవరించడానికి వీల్లేదని గిరి గీశారు.
మంత్రి వర్గ విస్తరణ మరుక్షణం నుంచే పిఎస్ ల కోటరీ పోటీ మొదలైంది. గత పరిచయాలను తెరమీదకు తెస్తూ ఈ స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కీలక శాఖలు కైవసం చేసుకున్న మంత్రులకు ఈ పోటీ మరీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులనే పిఎస్ లుగా తీసుకోవడం ఆనవాయితీ. అయితే ఈ పోస్టుల్లో ప్రత్యేక హోదా ఉంటుంది. వ్యక్తిగత పరిచయాలు, అధికారాలు ఉంటాయి. ప్రతీ ఉద్యోగి దీన్నో టర్నింగ్ పాయింట్ గా కూడా భావిస్తారు. డిప్యూటేషన్ పై వచ్చే ఇలాంటి పోస్టుల్లో ఆదాయం కూడా ఉంటుందనేది కొందరి అభిప్రాయం. దీంతో అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ పోటీ పడుతున్నారు. ఒక్కో మంత్రికి కనీసం ఐదు నుంచి 15 మంది రేసులో ఉన్నారు. ఇప్పటి వరకూ ఏదో రకంగా పరిచయం ఉన్న వారిని మంత్రులు పిఎస్ లుగా నియమించుకుంటున్నారు. ఈ అధికారాన్ని ప్రభుత్వం మంత్రులకే పరిమితం చేసింది.
Pages: 1 -2- News Posted: 30 May, 2009
|