వ్యక్తి`గతం'పై నిఘా
అయితే గత ఐదేళ్ళలో పలువురు వ్యక్తిగత కార్యదర్శుల వల్ల ప్రభుత్వం అప్రదిష్టపాలయింది. ఒకరిద్దరు మంత్రుల కార్యదర్శులు ఏకంగా భూకబ్జాలతో సంబంధాలున్నట్లు తేలింది. ఎన్నికల ముందు సంభాని చంద్రశేఖర్ పిఎస్ ఒకరు ఏకంగా మహిళను మోసం చేయడం వివాదాస్పదమైంది. అశ్లీల కార్యక్రమాల చిత్రాలు పత్రికల్లో ప్రచురితమయ్యాయి. మరికొందరు శాఖాపరమైన బదిలీల్లో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారనే ఫిర్యాదులొచ్చాయి. అంతే కాకుండా విపక్షాలకు రహస్య సమాచారం ఇస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రెవెన్యూ, హోం, ఆర్థిక విభాగాల్లో కీలకమైన డాక్యుమెంట్లు గత ఐదేళ్ళలో అనేకం లీకయినట్టు సమాచారం. ఈసారి ప్రధాన ప్రతిపక్షం టిడిపి బలంగా ఉంది. కాబట్టి ప్రతీ చిన్న పొరపాటునూ రాద్ధాంతం చేసే వీలుందనేది ప్రభుత్వ ఆలోచన. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు టిడిపి సానుభూతిపరులైన అధికారులు పలువురు వ్యూహాత్మకంగా అమాత్యుల వద్ద చేరుతున్నారు. కీలకమైన సమయంలో వైరీ పక్షాల ఆదేశాలను అమలు చేయడం వీరి కర్తవ్యంగా కన్పిస్తోంది. కాబట్టి ఇలాంటి వారిని ముందే దూరంగా ఉంచాలని సిఎం పేషీ తీర్మానించుకుంది.
మంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల జీవిత విశేషాలను పరిశీలించేందుకు నిఘా వర్గాలు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రికి అత్యంత విశ్వసనీయమైన ఇంటిలిజెన్స్ చీఫ్ అరవిందరావు సారధ్యంలో ఈ కసరత్తు సాగుతోంది. ఒక డిఐజి స్థాయి అధికారితో పాటు, నలుగురు ఎస్సీలు, మరికొంతమంది ఎస్ ఐలు ఈ బృందంలో ఉన్నారు. విధి నిర్వణలో నూటికి నూరుపాళ్ళు అంకిత భావం ఉన్నవాళ్ళనే ఈ పనికి వినియోగిస్తున్నారు. మంత్రులకు వచ్చిన అభ్యర్థనలు నిఘా వర్గాలకు అందాయి. శాఖాపరమైన రిపోర్టుతో పాటు, విద్యార్థి స్థాయి నుంచి వారి నడవడికను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. కొన్ని జిల్లాలకు ఇంటిలిజెన్స్ బృందంలోని అధికారులే వెళ్లి వివరాలు సేకరించాలని నిర్ణయించారు. ఏ చిన్న ఆరోపణలున్నా వారిని పక్కనబెట్టే వీలుంది. దీంతోపాటు పిఎస్ లుగా చేరే వారి వ్యక్తిగత ఆస్తులు, ఆదాయ వనరులు సమీక్షిస్తున్నారు. ఆదాయానికిమించి ఆస్తులున్నా, కేవలం సంపాదన కోసమే ఉద్యోగం చేస్తున్నా వారిని దూరంగా ఉంచాలని సిఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాంగ్రెస్ పట్ల అంకిత భావం, వారి కుటుంబీకులు కాంగ్రెస్ కు చెందినవారై ఉన్నా పరిశీలించాలని అంతర్గతంగా నిర్ణయించాయని తెలిసింది.
సిఎం కార్యాలయంలోని సిబ్బంది గుణగణాలను నిఘా వర్గాలు పరిశీలించాలని ఆదేశాలు వచ్చాయి. సిఎంవో అవినీతికి అడ్డాగా నిలిచిందనే విమర్శలు గతంలో వచ్చాయి. మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబ్బందిని మార్చలేదు. వీరిలో చాలామంది తెలుగుదేశం వీరాభిమానులు ఉన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇలాంటి అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను విపక్షాలకు అందజేసిన అధికారుల వివరాలు ప్రభుత్వానికి అందాయి. తాజాగా ఎన్నికల సందర్భంగానూ టిడిపి వైపు మొగ్గిన సిబ్బందీ ఉన్నారు. వీరివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి వీరిని వెంటనే బదిలీ చేయటానికి రంగం సిద్ధం చేస్తోంది.
Pages: -1- 2 News Posted: 30 May, 2009
|