138లో ఏమైందీ..?
హైదరాబాద్ : అధికారం దక్కిందన్న ఆనందం ఉన్నా... చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా సింపుల్ మెజారిటీ రావడంపై కాంగ్రెస్ లో పోస్టుమార్టం మొదలైంది. ఏపార్టీలతో పొత్తులు పెట్టుకోకుండా 294 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే వాటిలో 138 సీట్లలో ఓటమి పాలు కావడం కాంగ్రెస్ వ్యూహకర్తలను ఆలోచన్లో పడేసింది. కానీ 33 పార్లమెంట్ స్థానాల్లో సాధించిన గెలుపు నిష్పత్తిలో అసెంబ్లీ సీట్లు రాకపోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషణలను సాగిస్తోంది. పార్లమెంటుకు పడ్డ ఓట్లు అసెంబ్లీ సీట్ల విషయంలో ప్రత్యర్థులకు క్రాస్ కావడం పట్ల కాంగ్రెస్ వర్గాలు కలవరం చెందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చిన ఇదే సంప్రదాయం కొనసాగితే స్థానిక ఎన్నికల్లో తల బొప్పి కట్టడం తథ్యమని నాయకులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే మేల్కొని మరమ్మతులు చేపట్టక పోతే జిల్లా పరిషత్తుల్లో, మున్సిపాలిటీల్లో గమ్మత్తులు జరిగి గల్లంతయిపోవడం ఖాయమని కాంగ్రెస్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సంపూర్ణ సర్వేను చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ళుగా అమలు చేస్తున్న ఏయే పథకాలు ఓటర్లను ప్రభావితం చేశాయి, ఏయే పథకాలు ప్రజలను పెద్ద ఆకర్షించలేకపోయాయి అన్న అంశాలపై అధ్యయనం చేస్తున్నారు. లోక్ సభ స్థానాలు ముప్పయ్ మూడు గెలుచుకోగా అసెంబ్లీ స్థానాలను 156 మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై చేసిన ఆరోపణలు ప్రజల్లో ఏ మేరకు ప్రభావం చూపాయి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ప్రకటించిన నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీల పంపిణీ పథకాలను ప్రజలు ఎంతమేరకు విశ్వసించారు అన్న అంశాలను కూడా ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి కనీసం 175 అసెంబ్లీ స్థానాలు ఖాయంగా వస్తాయనుకోగా 156 మాత్రమే రావడానికి కారణం ఏమిటి? కచ్చితంగా గెలుస్తామనుకున్న కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓటమి చెందడానికి అభ్యర్థుల బాధ్యత ఎంతమేరకు ఉంది అన్నది కూడా పరిశీలించనున్నారు.
Pages: 1 -2- News Posted: 30 May, 2009
|