మీరా నెగ్గుకురాగలరా?
తరచు గలభా సృష్టిస్తుండే సభ్యులున్న సభకు సారథ్యం వహించిన సోమనాథ్ చటర్జీ కన్నా మీరా కుమార్ కు బాధ్యతల నిర్వహణ తేలిక కాగలదని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయం వెలిబుచ్చాయి. 'బిజెపి, వామపక్షాల సభ్యులు మొదటి సంవత్సరం లేదా ఆపైన దూకుడుగా వ్యవహరించకపోవచ్చు. వారిలో పోరాట స్వభావం నెలకొనే సమయానికి ఆమె ఈ పదవీ బాధ్యతల నిర్వహణలో కొంత అనుభవం సంపాదిస్తారు' అని కాంగ్రెస్ అధికారి ఒకరు అన్నారు.
మీరా కొన్ని సందర్భాలలో తాను కఠినంగా వ్యవహరించగలనని నిరూపించారు. తన తండ్రి జగ్జీవన్ రామ్ శత జయంతి సంవత్సరం 2008లో ఆమె ఒక విదేశీ టివి చానెల్ విలేఖరితో మాట్లాడినప్పుడు ఆయనకు, బి.ఆర్. అంబేద్కర్ కు మధ్య పోలికి తీసుకురావడాన్ని సహించనని స్పష్టం చేశారు. ఆ దళిత నేతలిద్దరూ సాటిలేని వారేనని ఆమె భావించినట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి.
2007లో మరొక దళిత ప్రముఖుడు కాన్షీరామ్ కోసం లుటియెన్స్ జోన్ లోని ఒక బంగళాను స్మారక కేంద్రంగా మార్చాలని యుపిఎ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు తన తండ్రి నివసించిన నంబర్ 6, కృష్ణమీనన్ మార్గ్ భవనానికీ అదే ప్రతిపత్తి కల్పించాలని మీరా కుమార్ కోరారు. జగ్జీవన్ పేరిట ఒక జాతీయ ఫౌండేషన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అయితే, పూర్వపు యుపిఎ ప్రభుత్వంలో సాంఘిక న్యాయం, సాధికారత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీరా దళిత సమస్యలపై అదే కఠిన చిత్తాన్ని లేదా స్పష్టతను ప్రదర్శించలేకపోయారు. ప్రైవేట్ రంగంలో దళితులకు రిజర్వేషన్ కల్పించవలసిన అగత్యం ఉందని ఆమె భావించారు. కాని ఈ అంశాన్ని పరిశీలిస్తున్న మంత్రుల బృందంలోనే ఇందుకు వ్యతిరేకత వ్యక్తమయ్యేసరికి ఆమె వెనుకకు తగ్గారు.
స్పీకర్ ఎన్నికకు ఒక రోజు ముందే యుపిఎ, బిజెపి రెండింటికీ అంగీకారయోగ్యమైన అభ్యర్థిగా ఆమె ఆవిర్భవించగా పార్లమెంట్ లో కొందరు అధికారులలో ఒక విధమైన సందిగ్ధత కానవచ్చింది. 'ఆమె మార్గదర్శనం కోసం చటర్జీ, పూర్ణో ఎ. సంగ్మాలనో, తోడు కోసం ఎవరినైనా తీసుకోవలసి ఉంటుంది' అని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 'ఎవరినైనా' అని అనడంలో ఆయన ఉద్దేశం స్వర్గీయ జి.ఎం.సి. బాలయోగి కావచ్చు. తెలుగు దేశం పార్టీకి చెందిన బాలయోగి ఎన్ డిఎ హయాంలో స్పీకర్ గా ఉన్న విషయం విదితమే. సభలో ఆగ్రహావేశాలు శ్రుతి మించుతున్నప్పుడు 'ప్లీజ్, ప్లీజ్' అని ఆయన ప్రాథేయపడుతుండేవారు. అయితే, ఎంపిగా బాలయోగికి అనుభవం బాగా తక్కువేనని చెప్పాలి. ఎంపిగా రెండవ సారి ఎన్నికైనప్పుడు ఆయన స్పీకర్ పదవిని అలంకరించారు.
Pages: -1- 2 -3- News Posted: 3 June, 2009
|