100 రోజుల ప్లాన్ జరిగేనా?
న్యూఢిల్లీ : మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రానున్న 100 రోజులలోగా కొన్ని పథకాలు అమలు పరుస్తామని వాగ్దానం చేసింది. వాటి అమలుకు గల అవకాశాలపై విశ్లేషకుల అభిప్రాయాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
మహిళల రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. మరి ఇది జరిగేనా? మహిళలు కీలక స్థానాలలో ఉన్నందున గతంలో కన్నా ఇప్పుడే ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు మిక్కుటంగా ఉన్నాయి. అయితే, విమర్శకులను తన వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ ఎంత మేరకు సఫలం అవుతుందనే విషయంపైనే బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉంది. వెనుకబడిన తరగతులకు (బిసిలకు) ఇందులోనే రిజర్వేషన్ కల్పించాలని ఆర్ జెడి, సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) వంటి చిన్న పార్టీలు కోరడమే కొంత ఆందోళన కలిగిస్తున్నది. మహిళలకు కల్పించే మొత్తం రిజర్వేషన్ (33 శాతం)లో ఒబిసిలకు 27 శాతం ప్రత్యేకించాలని ఈ పార్టీలు కోరుతున్నాయి. ఈ బిల్లుకు ఆమోద ముద్ర పొందడానికి కాంగ్రెస్ చాలా చాతుర్యంతో వ్యవహరించవలసి ఉంటుంది. బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుతానికి బిల్లును 47 మంది ఎంపిలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల యుపిఎ, బిజెపి, వామపక్షాలు కలసి బిల్లును ఆమోదింప చేయవచ్చు. అయితే, ఇందుకు ఒక అడ్డుగోడ లేకపోలేదు. కాంగ్రెస్ లోను, బిల్లుకు అధికారికంగా మద్దతు ఇస్తున్న కొన్ని ఇతర పార్టీలలోను పలువురు పురుషులు ఇప్పటికీ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరి సోనియా గాంధి, మమతా బెనర్జీ, సుష్మా స్వరాజ్, బృందా కారత్ పూనుకుంటే బిల్లు ఆమోదం పొందవచ్చు.
పంచాయతీలు, మునిసిపాలిటీలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన కూడా ఉన్నది. మరి ఇది జరిగేనా? పార్లమెంట్, అసెంబ్లీలలో 33 శాతం కోటా బిల్లు కన్నా ఈ బిల్లే తేలికగా ఆమోదం పొందవచ్చు. ఎందుకంటే బీహార్ లో ఇప్పటికే స్థానిక సంస్థలలో ఈ రిజర్వేషన్లు కల్పించారు. 33 శాతం కోటా బిల్లు ప్రస్తుత ముసాయిదాను వ్యతిరేకిస్తున్న ప్రధాన పార్టీలలో ఒకటైన జనతా దళ్ (యునైటెడ్) బీహార్ చట్టాన్ని తీసుకువచ్చింది.
కేంద్ర ప్రభుత్వోద్యోగాలలో మహిళ సంఖ్య పెంచాలనే ప్రతిపాదన ఉన్నది. ఇది ప్రభుత్వ వాగ్దానాలన్నిటిలో అమలు చేయడానికి సులభసాధ్యమైనది ఇదే. ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం నుంచి ఒక ఉత్తర్వు మాత్రమే ఇందుకు అవసరం. కాని ఉద్యోగుల రిజిస్టర్లలో ఫలితం కనిపించడానికి కొంత వ్యవధి పట్టుతుంది. జాతీయ మహిళా సాధికారత పథకం (ఎన్ఎంఇడబ్ల్యు) ప్రతిపాదన కూడా ఉన్నది. ఇక్కడ పదజాలం మాత్రమే కొత్తది. మహిళా సాధికారతకు సంబంధించి ఇప్పుడున్న కార్యక్రమాలను మరింత సమన్వయంతో అమలు పరచడమే ఈ పథకం లక్ష్యం. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సూచించిన పథకం ఇది. ఇది కనుక విజయవంతమైతే ఇది వరకటి కన్నా విధాన నిర్ణాయక యంత్రాంగంలో మహిళలకు ఇతోధిక ప్రాతినిధ్యం దీని వల్ల లభిస్తుంది.
Pages: 1 -2- -3- News Posted: 6 June, 2009
|