రచ్చ ఆగి చర్చ జరిగేనా?
హైదరాబాద్ : శాసనసభ... ప్రజాసమస్యలపై చర్చించి తగు నిర్ణయం తీసుకోడానికి అనువైన చక్కని వేదిక. రాజ్యాంగకర్తలు ఆశించిందీ ఇదే! సభా సమావేశాలు జరిగిన ప్రతిసారీ జరుగుతున్నదేమిటి? అధికారపక్షం - ప్రతి పక్షం శాసనసభ్యుల పరస్పరం సవాళ్ళు... అరుపులు ... కేకలు...పిల్లికూతలు, రన్నింగ్ కామెంట్రీలు వెరసి వాకౌట్లు. లేదంటే మార్షల్స్ చేత బయటకు పంపించడం. శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నప్పటి నుంచి ఈ దృశ్యాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు 'చిర పరిచయం' గా మారాయి. ఎదుటి పక్షం నేతల ఆస్తులు... అవినీతి పై సవాళ్ళకు శాసనసభ వేదికగా మారింది. చర్చల్లో అసలు సమస్యలు గాలికి వదిలి వ్యక్తిగత అంశాలకు, అనవసర విషయాలకు దారిమళ్ళడం చూస్తున్నాం.
ప్రస్తుత సభా సమావేశంలోనే తెలుగుదేశం శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు, మంత్రి రోశయ్య సభలో క్షమాపణలు చెప్పిన పరిస్థితి... చర్చల సరళిని తేటతెల్లం చేస్తుంది. సభ్యులు నిర్మాణాత్మకంగా సమస్యల గురించి మాట్లాడే ధోరణి లోపించిన కారణంగానే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సభా సమావేశాలు ప్రారంభం అనగానే అధికార పక్షాన్ని ఏయే అవినీతి ఆరోపణలతో ఇరకాటంలో పెట్టవచ్చునని ప్రతిపక్షాలు, ప్రతిపక్షాన్ని ఎలా తట్టుకోవాలి!, ఎలా వారిని ఇబ్బంది పెట్టాలి? వారు లేవనెత్తే అంశాలను చర్చకు రాకుండా ఎలా అడ్డుకోవాలని... అధికార పక్షం వ్యూహం పన్నడం రివాజుగా మారింది. సభ సజావుగా జరిగేందుకు శాసనసభా వ్యవహారాల కమిటీ సమావేశంలో అంగీకరించిన పక్షాలే తిరిగి సభలో తమ 'పంధా'ను మార్చుకోవడాన్ని రాష్ట్ర ప్రజానీకం చూసింది. నిజంగా సమస్యలపై చర్చించి... అవసరమైన తీర్మానాలు చేసిన సందర్భాలు శాసనసభలో బహు అరుదే అని చెప్పవచ్చు. బడ్జెట్ సమావేశాల్లో 'మీరేం చేశారంటే ? మీరేం చేశారు' అంటూ అధికార, ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకోవడమే తప్ప... నిర్మాణాత్మక చర్చలు జరిగిన సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. ప్రతిపక్షం సభ్యులు చేసిన నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వం సహృదయంతో స్వీకరించే 'సత్తెకాలం' ఇప్పుడు లేదు!
Pages: 1 -2- -3- News Posted: 5 August, 2009
|