రచ్చ ఆగి చర్చ జరిగేనా?
అధికార, ప్రతిపక్షాల మధ్య నెలకొన్న వైషమ్యాలే ఇందుకు కారణం. అధికార పక్షానికీ, మిత్ర పక్షాలకూ మధ్య పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకంటే... గత మూడు దశాబ్దాలుగా జరిగింది ఇదే. ఎన్నికలకు మిత్ర పక్షాలుగా కలిసి పోటీ చేసిన పార్టీలు కూడా... అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికి అధికార, ప్రతిపక్షాలుగా విడిపోవడం జరుగుతుంది. ఇటీవల కాలాన్ని గమనిస్తే 1999 వామపక్షాలు తెలుగుదేశంతో కలిసి పోటీ చేశాయి.
అధికారంలోకి వచ్చిన అనంతరం క్రమేణా వామపక్షాలతో తెలుగుదేశానికి విభేదాలు పెరిగాయి. దాంతో అవి కాంగ్రెస్ కు చేరువయ్యాయి. అనంతరం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలూ కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత వామపక్షాలు ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేపట్టి... తెలుగుదేశం చెంతకు చేరాయి. ఈ రెండు సందర్భాల్లో ఎన్నికల్లో తెలుగుదేశం లేదా కాంగ్రెస్ తో కలిసిపోటీ చేసిన పార్టీలు అధికారంలోకి వచ్చాక కొద్ది కాలమే ఆయా పార్టీలతో సన్నిహితంగా మెలిగాయి. అనంతరం విద్యుత్ సమస్యలు, భూమిపంపిణీ, సెజ్ లు, అవుటర్ రింగ్ రోడ్ వంటి సమస్యలపై అధికార పక్షంతో పోరాడి ప్రత్యర్ధులుగా మారాయి.
ఇదే సమయంలో శాసనసభా సమావేశాల్లో చర్చలు మాత్రం - అధికార పక్షం.... ప్రధాన ప్రతిపక్షం మధ్యనే ఎక్కువగా నడిచాయి. మిగిలిన పక్షాలు 'ఆటలో అరటి పండు'గా మారాయి. పోనీ ఈ చర్చలేమైనా అర్ధవంతంగా జరిగాయా అంటే... షరామామూలే! ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసమంటూ రాజకీయ ప్రవేశం చేసిన చిరంజీవి శాసనసభ సమావేశాల్లో 'తృతీయ' కూటమి ఏర్పాటుకు చిరు ప్రయత్నం చేశారు. సంఖ్యాబలం ఆధారంగా ఆయా పక్షాలకు మాట్లాడేందుకు సమయాన్ని కేటాయిస్తున్న విధానాన్ని మార్చాలని కోరుతున్నారు. దీనికితోడు ప్రజలకు తెలిసిన వాటినే ఉభయపక్షాలు చెప్పుకోవడం, వాదించుకోవడం వల్ల తామంతా సభలో 'ప్రేక్షకులు'గా మారుతున్నామే తప్ప అర్థ వంతమైన చర్చ చేసే అవకాశం ఉండడం లేదని చిరంజీవి ఆవేదన చెందుతున్నారు. సభలో చర్చసమయాన్ని పరస్పర ఆరోపణలతో ఉభయపక్షాలు.. నేతలు 'హరించడంతో' తాము ఏం చేయలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మంగళవారం శాసనసభ ఆవరణలో తెలుగుదేశం, కాంగ్రేసేతర పక్షాలతో సమావేశాన్ని చిరంజీవి నిర్వహించారు. ఈ సమావేశానికి తెరాస, వామపక్షాలు, భాజపా, లోక్ సత్తా నేతలు హాజరయ్యారు. వారంతా తమకు సభలో జరిగే అన్యాయం గురించి స్పీకర్ కు తెలిపారు.
Pages: -1- 2 -3- News Posted: 5 August, 2009
|