రచ్చ ఆగి చర్చ జరిగేనా?
సభలో సభ్యుడు వేసిన ప్రశ్నకు అనుగుణమైన సమాధానం ఇచ్చే విధానం కూడా లుప్తమవుతోంది. ఉదాహరణకు గిరిజన ఉద్యోగాల భర్తీ గురించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నిస్తే... అల్లూరి, కొమరం భీమ్ తదితర నేతల స్ఫూర్తితో తమ ప్రభుత్వం పని చేస్తోందంటూ, గతంలో మీరేం చేశారంటూ ముఖ్యమంత్రి వైఎస్ ఎదురు దాడితో కూడిన సమాధానమిచ్చారు. అలాగే మరో సందర్భంలో లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ బడ్జెట్ గురించి నిర్మాణాత్మకంగా మాట్లాడారు. ఆరోగ్య శ్రీ కేటాయింపులు చెబుతూ గ్యాస్ లేకుండానే గ్యాస్ గ్రిడ్ ను గుజరాత్ ఏర్పాటు చేసిన వైనాన్ని, ఇతర అంశాల్ని జేపీ వివరిస్తున్నారు. ఈ దశలో సమయం మించిపోతోందంటూ ముఖ్యమంత్రి వైఎస్ తన చేతి గడియారాన్ని చూపించారు. స్పీకర్ ఏమో 'త్వరగా ముగించండి' అని సభ్యునికి సూచించిండం కనిపించింది.
ఇటువంటి ఉదంతాలు, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల మధ్య నిరంతరం అవినీతి ఆరోపణలు - సవాళ్ళు - ప్రతిసవాళ్ళతో సభలో కాలహరణం జరుగుతున్నది అనేదే ప్రజాస్వామ్య వాదుల ఆవేదన. అందుకనే.... 'ఆరేళ్ళుగా వారిద్దరూ (బాబు, వైఎస్) అవినీతి ఆరోపణలు, సవాళ్ళు చేసుకుంటున్నారే కానీ... సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించింది లేద'ని జేపీ వ్యాఖ్యానించారు. గతంలో జూపూడి యజ్ఞనారాయణ, గౌతు లచ్చన్న, సుందరయ్య, నల్లమల గిరిప్రసాద్ వంటి హేమాహేమీలు శాసన సభ్యులుగా ఉండగా జరిగిన చర్చల వంటివి ఇకనైనా శాసనసభలో కనిపించాలని ఆశించడం అత్యాశ కాదేమో?
Pages: -1- -2- 3 News Posted: 5 August, 2009
|