బామ్మగారి భావాల్లోనే భారత్ బిగుతు బట్టలు వేసేసుకుని... లిప్ స్టిక్ లు పూసేసుకుని...అర్ధరాత్రి - అపరాత్రి పబ్బుల్లో, క్లబ్బుల్లో తైతక్కలాడే కుర్రకారుని చూసి భారద్దేశం తగలడిపోతోందని... ఫారిన్ వెర్రి వ్యామోహంలో పడి మన సంస్కృతినీ, సంప్రదాయాలను వదిలేస్తున్నారని గంగవెర్రులెత్తే వారికో శుభవార్త. వేషాలు కట్టినా, విచ్చలవిడిగా సంచరిస్తున్నట్లు కనిపించినా భారతీయుల భావాలు వేదకాలంలోనే ఉన్నాయట. ఆర్ధిక ప్రగతి, కాస్మోపాలిటన్ సంస్కృతి బాహ్యరూపాలను చూసి బెంబేలు పడక్కర్లేదని, దేశంలోని యువత, మధ్య వయస్కుల మనోభావాలు నాన్నగారి, బామ్మగారి భావాలకు దాస్యరికం చేస్తూనే ఉన్నాయని తేలింది. సిఎన్ఎన్-ఐబిఎన్ టివి ఛానల్ తో కలిసి హిందూస్తాన్ టైమ్స్ పత్రిక దేశంలోని 16 మెట్రోనగరాలలో, చిన్నచిన్న పట్టణాల్లో చేసిన సర్వే అందరనీ ఆశ్చర్య చకితుల్ని చేసే సంగతుల్ని బయటపెట్టింది. ఈ వందకోట్ల ప్రజల దేశంలో మూడింట నాల్గొంతుల మంది యువకులే... కానీ వారి దృక్ఫధం ఆధునిక భావాల వైపు కాకుండా సంప్రదాయ భారతీయ తత్వం వైపే ఉంది. స్వలింగ సంపర్కం, టీవీ చూపించే అనైతిక ప్రభావం, వస్త్రాలంకరణ, సంస్కృతి పట్ల భారతీయులు ఏ వయస్సు వారైనా ఒక్కలాగే ఆలోచిస్తున్నారు. ఒకలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.
విద్యార్థినులు జీన్ ఫ్యాంట్లను ధరించడాన్ని కాన్పూర్ లో ఓ కాలేజీ ప్రిన్సిపాల్ నిషేదించారు. ఇది తాలిబనైజేషన్ అని మీడియా గగ్గోలు పెట్టింది. కానీ 18-35 సంవత్సరాల మధ్య వయస్సున్న యువతీ యువకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. విద్యాలయాలలో పాశ్చాత్య దుస్తులను ధరించడాన్ని నిషేదించాలని డెబ్బైశాతం మందికి పైగా అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లోనూ, మున్సిపల్ పట్టణాల్లోనూ నివసించే ప్రజల మధ్య ఈవిషయంలో అభిప్రాయభేదమేమీ కనిపించలేదు. ఇలాంటి నిర్ణయాల పట్ల యువతలో ఏమైనా ఆగ్రహం ఉందని మీరుభావిస్తున్నట్లైతే తప్పులో కాలేసినట్లే. పాతికేళ్ళలోపు వయస్సున్న యువతీయువకుల్లో అరవైనాలుగు శాతం మంది ఈ నిర్ణయాన్ని సమర్థించారు. చాలామంది భారతీయ యువతీయువకులు గుడ్డిగా పాశ్చాత్య ధోరణలను అనుకరిస్తున్నారని, భారతీయ సంప్రదాయాలను మంటగలుపుతున్నారనికూడా వీరు మండిపడుతున్నారు.
Pages: 1 -2- -3- News Posted: 13 August, 2009
|