టీమ్ ఇండియా ఇక బిజీ బిజీ బెంగళూరు : భారత క్రికెట్ జట్టుకు ఆరు వారాల విశ్రాంతి అధికారికంగా గురువారం ముగిసింది. ఇటీవలి కాలంలో జట్టుకు ఇంత సుదీర్ఘ విరామం లభించలేదు. జట్టు కోసం నాలుగు రోజుల కండీషనింగ్ శిబిరం గురువారం బెంగళూరులో మొదలైంది. ముందుగా జట్టు సభ్యుల ఫిట్ నెస్ స్థాయిని మదింపు వేస్తున్నారు. రెండు వారాల క్రితం ఢిల్లీ, ముంబైలలో నిర్వహించిన సమీక్షతో ఈ మదింపు ఫలితాలను సరిపోలుస్తారు.
'ఈ ఫలితాలతో నేను ఎంతో సంతుష్టి చెందాను. రెండు వారాల క్రితం మేము గమనించిన ప్రకారరం ప్రతి ఒక్క క్రీడాకారునిలో గణనీయమైన మెరుగుదల ఉన్నది. అంటే వారు దీనిని తీవ్రంగా పట్టించుకుంటున్నారన్నమాట. మాకు కావలసిందిదే' అని జట్టు కోచ్ గారీ కిర్ స్టెన్ పేర్కొన్నారు. 'ఇది ఆటలో భాగమని, తామంతా మెరుగుపరచుకోవలసి ఉందని క్రీడాకారులు గ్రహించారు' అని ఆయన చెప్పారు.
తిరిగి వన్ డే జట్టులో స్థానం పొందిన రాహుల్ ద్రావిడ్ స్వస్థలంలో ఈ శిబిరం నిర్వహిస్తుండడంతో సహజంగానే అతని పునరాగమనంపై చర్చలు సాగుతున్నాయి. 'అతనిని తిరిగి జట్టులో చేర్చుకోవడం మంచిదే. అతను ఈ జట్టును మరింత పరిపుష్టం చేయగలడు. అతను సహజంగానే రాణిస్తుంటాడు' అని కిర్ స్టెన్ వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ ద్రావిడ్ నుంచి తానేమీ ప్రత్యేకంగా ఆశించడం లేదని కోచ్ చెప్పారు.
'ఏ ఇతర క్రీడాకారుని నుంచి నేను ఏది ఆశిస్తానో రాహుల్ నుంచి కూడా అదే అశిస్తాను. అతను నూటికి నూరు శాతం ప్రతిభ కనబరచాలని కోరుకుంటున్నాను. నేను అతనికి ఆ విషయం చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే టీమ్ ఇండియా కోసం బ్యాడ్జి తగిలించుకొన్న ప్రతి పర్యాయం అతను శిక్షణ శిబిరంలోనైనా లేదా మ్యాచ్ లో నైనా అదే విధంగా ప్రతిభ కనబరుస్తుంటాడు' అని కోచ్ పేర్కొన్నారు.
Pages: 1 -2- News Posted: 28 August, 2009
|