తడాఖా చూపిన శ్రీనివాసన్!
ఐపిఎల్ తొలి టోర్నీ నుంచి సమకూరిన రూ. 661 కోట్ల లాభంలో పది శాతం వాటాను ఐఎంజి కోరడంతో బిసిసిఐ అగ్ర నేతలు ఖంగు తిన్నారని బోర్డు వర్గాలు తెలియజేశాయి. 'బిసిసిఐ ఐపిఎల్ తొలి సీజన్ కు సంబంధించి ఇప్పటికే ఐఎంజికి రూ. 42.92 కోట్లు చెల్లించింది. రెండవ సీజన్ కు వారికి రూ. 33 కోట్లు చెల్లించగలం. అంతకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వం' అని బిసిసిఐ కార్యవర్గ సభ్యుడు ఒకరు స్పష్టం చేశారు.
అయితే, ఈ వివరణకు ఐపిఎల్ వర్గాలు ఆక్షేపణ తెలియజేశాయి. 'పోరు గెలిచారు కనుక అసలు సైన్యంతో కలసి లాభాలు పంచుకోవడానికి వారు (బిసిసిఐ) విముఖంగా ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది' అని ఐపిఎల్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
బోర్డు 2008లో ఐఎంజితో ఒక ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకున్నది. టోర్నమెంట్ మొత్తం ఆదాయంలో పది శాతాన్ని కమిషన్ గా చెల్లించగలమని బోర్డు వాగ్దానం చేసింది. అయితే, ఆశ్చర్యకరంగా ఐపిఎల్ తో గాని, బిసిసిఐతో గాని ఐఎంజి కాంట్రాక్టు ఏదీ కుదుర్చుకోలేదు.
కాగా తమపై ఆధిపత్యం చెలాయించాలని బోర్డు చూస్తున్నదని ఐపిఎల్ అధికారులు అంటున్నారు. 'ఐపిఎల్ కు ఐఎంజి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్ఠ తీసుకువచ్చి ఒక బ్రాండ్ గా చేసింది. స్వల్ప వ్యవధి నోటీసుతో వారు టోర్నమెంట్ ను దక్షిణాఫ్రికాకు మార్చారు. వారి పట్ల మరింత మెరుగైన రీతిలో వ్యవహరించవలసి ఉంది. బుధవారం మా పాలక మండలి సమావేశంలో మేము ఈ విషయం చర్చించగలం' అని ఐపిఎల్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా, ఐఎంజితో తెగతెంపులు చేసుకోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ నాలుగు ఫ్రాంచైజీలు - కోలకతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ - బిసిసిఐకి లేఖలు పంపాయి. కొన్నిఫ్రాంచైజీల యజమానులు మోడికి మద్దతు తెలిపే ప్రయత్నమే ఈ లేఖలని బిసిసిఐ అధికారులు పేర్కొన్నారు.
అయితే, చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు డక్కన్ చార్జర్స్ కూడా ఇంతవరకు ఈ వివాదానికి దూరంగా ఉన్నది. 'ఐపిఎల్ లో ఎక్కువ గ్లామర్ ఉన్నవిగా పేర్కొంటున్న జట్ల పట్ల ఐఎంజి కొంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నది. మరి ఆ జట్లు వారికి వత్తాసుగా నిలవడంలో ఆశ్చర్యం లేదు కదా' అని డక్కన్ చార్జర్స్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
Pages: -1- 2 News Posted: 1 September, 2009
|