తిరువనంతపురం : అన్నెం పున్నెం తెలీని అమాయక అమ్మాయిలను తీవ్రవాదం(జీహాద్) ఉచ్చులోకి లాగడానికి వలపుల వలలను విసురుతున్నారట. ఈ విషయాన్ని ధృవీకరించుకున్న కేరళ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపడానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని కళాశాలల్లో సాగుతున్న ఈ వ్యవహరం గుట్టును రట్టు చేయడానికి ఈ బృందం రంగలోకి దిగిందని డిజిపి జాకబ్ పున్నూస్ వెల్లడించారు. ఇద్దరు అమ్మాయిల ఆచూకీ కోసం వారి తల్లితండ్రులు కేరళ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేయడంతో విస్మయం కలిగించే ఈ విషయం బయటపడింది. పత్తనంతిట్ట జిల్లాలోని సెయింట్ జాన్స్ కళాశాలలో చదివే ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. అక్కడే హస్టల్ ఉండి చదువుతున్న ఈ అమ్మాయిలు తమ సీనియర్ విద్యార్ధి పన్నిన ప్రేమ ఉచ్చులో చిక్కుకున్నారని వెల్లడయింది.
ఈ కళాశాలలో చదివిన ఓ అబ్బాయి ప్రవర్తన బాగా లేదని కొన్ని సంవత్సరాల క్రితమే అతనిని కళాశాలనుంచి బహిష్కరించారు. కానీ అతను నలుగురు జూనియర్ అమ్మాయిలతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. వీరిలో ఇద్దరు ఎంబిఎ చదుతున్న అమ్మాయిలు ఉన్నారు. వారిని ఇస్లాం మతంలోకి మారమని బలవంతం చేశాడు. ప్రమాదాన్ని పసిగట్టిన ఒక అమ్మాయి అతని వల నుంచి తప్పించుకుంది. మరో అమ్మాయి మానసిక సమస్యలకు గురైంది. కాని ఇద్దరు ఎంబిఎ అమ్మాయిలు మాత్రం ప్రేమ మత్తులో పడి అతని వెంట వెళ్ళిపోయారని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీకుమారన్ నాయర్ వివరించారు.