సైన్సుకు పునరుత్తేజం న్యూఢిల్లీ : క్లాసికల్ సైన్సులతో ప రిశోధన ఆధారిత అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కోసం అన్వేషించే మేటి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు త్వరలో ఒక అవకాశం లభించనున్నది. బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్ సి) తన నూరేళ్ళ చరిత్రలో మొదటి సారిగా అత్యున్నత స్థాయి అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను ప్రారంభించాలని యోచిస్తున్నది. దేశంలోని వైజ్ఞానిక పరిశోధనా సంస్థలలో తనకు ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించి తన ప్రముఖ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ సంస్థ ఈవిధంగా ప్రయత్నిస్తున్నది.
అత్యుత్తమ యువ మేధావులను విశిష్టమైన సైన్స్, ఇంజనీరింగ్ రంగాలలోకి ఆకర్షించి, నిలుపుకోవడానికి ప్రత్యేకమైన నాలుగేళ్ళ పరిశోధన ఆధారిత అండర్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రవేశపెట్టాలని ఐఐఎస్ సి యోచిస్తున్నది. ఈ కోర్సులో భాగంగా విద్యార్థులకు, తన పరిశోధకులకు మధ్య ముఖాముఖి చర్చలకు కూడా అవకాశం కల్పించాలని సంస్థ ఆలోచన.
'మేము కొన్ని బాలారిష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అయితే, మేము నెగ్గుకు రాగలమని నా విశ్వాసం' అని ఐఐఎస్ సి డీన్, ఈ కోర్సుకు రూపకల్పన చేసిన బృందం నాయకుడు ప్రొఫెసర్ ఎస్.కె. బిశ్వాస్ 'ది టెలిగ్రాఫ్' పత్రిక విలేఖరికి తెలియజేశారు. సంస్థ డైరెక్టర్ పి. బలరామ్ ఎంపిక చేసిన ఒక బృందం రూపొందించిన ఈ కోర్సు ముసాయిదాను ఈ నెల ద్వితీయార్ధంలో ఖరారు చేయవచ్చు. ఆతరువాత ఈ ప్రణాళికను లాంఛనంగా ఆవిష్కరించవచ్చు. సంస్థ రూపొందించిన ముసాయిదా కోర్సుకు ఈ నెల 2న జరిగిన ఒక సమావేశంలో ఫ్యాకల్టీ ఆమోదముద్ర లభించింది. ఇంతకుముందు ఒక ముసాయిదాను ఫ్యాకల్టీ తిరస్కరించింది.
జంషెడ్జీ టాటా కలను సాకారం చేయడానికై 1909లో ఆవిర్భవించి, నూరేళ్ళ పండుగను జరుపుకుంటున్న ఈ ఇన్ స్టిట్యూట్ తన భవిష్యత్ మార్గంపై ఎన్నడూ లేని విధంగా 'మధనపడుతున్న' దశలో ఈ చర్య తీసుకుంటున్నట్లు సంస్థ వర్గాలు తెలియజేశాయి.
పాశ్చాత్య దేశాలలో, హార్వర్డ్, కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా మసాచ్యుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) వంటి పెద్ద రీసర్చ్ యూనివర్శిటీలలో అగ్రశ్రేణి పరిశోధనకు అవకాశాలతో ముడిపెట్టిన పటిష్ఠమైన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి. 'పరిశోధన పరిఢవిల్లిన ప్రతి చోట దానికి అండగా గొప్ప అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు ఉన్నాయి' అని బిశ్వాస్ చెప్పారు.
Pages: 1 -2- -3- News Posted: 7 September, 2009
|