'షాక్' డెత్స్ బూటకమేనా? న్యూఢిల్లీ: వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం రాష్ట్రంలో సంభవించిన ఆకస్మిక మరణాలపై మెయిల్ టుడే ప్రచురించిన కథనం సంచలనాత్మకంగా మారింది. ఈ కథనంపై ఆగ్రహోదగ్రులైన వైఎస్ జగన్ మద్దతుదారులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతోపాటు ఆ పత్రిక కాపీలను వీధులలో దగ్ధం చేశారు. మొత్తం మీద వైఎస్ మరణాంతరం షాక్ తో మరణించినట్లుగా చెబుతున్న వారి సంఖ్యపై మెయిల్ టుడే లేవనెత్తిన వివాదం కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు చేరింది. వైఎస్ మరణాంతరం మరణవార్తను విని తట్టుకోలేక గుండెపోటుతోను, ఆత్మహత్యకు పాల్పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వందల సంఖ్యలోకి చేరడంతో ఇదంతా నిజమేనా అన్న సందేహాలు తలెత్తాయి.
అయితే ఈ లెక్కల్లోని నిజానిజాలు నిగ్గు తేల్చే నివేదికలు అగ్రనేతలకు చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారితో మమేకమై పని చేసిన వైఎస్ ఇకలేరన్న వార్త తట్టుకోలేక, ఆయన వారసుడు జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలంటూ వందల సంఖ్యలో అభిమానులు, ప్రజలు బలవన్మరణానికి పాల్పడుతున్న వైనం కాంగ్రెస్ అధిష్టానాన్ని విస్మయపరుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ సైతం విలేఖరుల వద్ద ప్రస్తావించారు ఈ మరణాల పట్ల ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. తదనంతరం మెయిల్ టుడే ప్రచురించిన కథనం కాంగ్రెస్ అధిష్టానాన్ని మరింత అయోమయంలో పడేశాయి. దీంతో ఈ షాక్ మరణాల లెక్కలు తేల్చేందుకు రంగంలోకి దిగిన అధిష్టానానికి నిజానిజాలు నిగ్గు తేల్చడంలో తల ప్రాణం తోకవచ్చింది.
Pages: 1 -2- -3- News Posted: 18 September, 2009
|