'షాక్' డెత్స్ బూటకమేనా? దీనికి సంబంధించి రాష్ట్రం నుంచి వచ్చిన రెండు వర్గాల లెక్కలపై పార్టీలో చర్చకు తెర తీశాయి. అవన్నీ షాక్ మరణాలా? సహజ మరణాలా? అందులో నిజంగా వైఎస్ అభిమానులు ఎంత మంది ఉన్నారు? వారంతా జగన్ కోసం నిజంగా ప్రాణాలర్పిస్తున్నారా? అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ నుంచి సొంతగా తెప్పించుకుంటున్న రహస్య నివేదికలపై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, అహ్మద్ పటేల్, ప్రణబ్‌ముఖర్జీ వద్దకు ఈ నివేదికలు ఈపాటికే వెళ్లినట్లు సమాచారం. మృతుల గ్రామాల్లోకి వెళ్లి వాటి కారణాలను ఆరా తీయడంతోపాటు, ఏ కారణంతో మృతి చెందారన్న కోణంలోనూ అధిష్టానం నివేదికలు తెప్పించుకుంది. దీనికితోడు.. ఆంధ్ర రాష్ట్రానికే చెందిన కొందరు కాంగ్రెస్ ప్రముఖులు పంపిన నివేదికలను తమకు వచ్చిన నివేదికలతో బేరీజు వేసుకుని కసరత్తు చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ఒక బృందమే పనిచేస్తున్నట్లు సమాచారం. దీని విశ్లేషణల ఆధారంగానే రెండురోజుల క్రితం ప్రధాని మన్మోహన్, అంతకుముందు ప్రణబ్ కూడా ఆంధ్రలో జరుగుతున్న మరణాలన్నీ నిలిచిపోయి, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకునేది లేదని కెవిపి, ఎంపిల వద్ద నేరుగా వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం.
ఏఐసిసి వర్గాల సమాచారం ప్రకారం.. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ మృతి, జగన్‌కు మద్దతుగా పెరిగిపోతున్న మరణాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసి, ఆ లెక్కలు, వాటి వెనుక దాగిన వాస్తవాలపై కసరత్తు చేయడం మొదలుపెట్టింది. ఇప్పటివరకూ పార్టీకి అందిన సమాచారం ప్రకారం మొత్తం 516 మంది మృతి చెందినట్లు నివేదికలో వెల్లడయింది. అయితే అందులో అసలు మృతులెందరు? అన్న కోణంలో చర్చిస్తోంది. అధిష్టానానికి వివిధ రూపాల్లో అందిన సమాచారం ప్రకారం కేవలం 44 మంది మాత్రమే షాక్ తోను, జగన్ సిఎం కావాలంటూ మృతి చెందినట్లు స్పష్టమయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన 472 మంది మరణాలు సహజ మరణాలుగానే తేలినట్లు తెలుస్తోంది.
ఇలా మరణించిన వారిలో ఆదిలాబాద్‌లో అత్యధికంగా 7 గురు, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో నలుగురు చొప్పున, నల్గొండలో 5, వరంగల్, రంగారెడ్డి, ఖమ్మం, గుంటూరులో ముగ్గురు చొప్పున, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, మెదక్, విజయవాడ, విశాఖ రూరల్‌లో ఒకరు చొప్పున, పశ్చిమ గోదావరి, మహబూబ్‌నగర్, కడపలో ఇద్దరు చొప్పున అభిమానులు మృతి చెందారు. అయితే.. హైదరాబాద్, నిజామాబాద్, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మాత్రం ఈ తరహాలో వాస్తవానికి ఎలాంటి మృతులు లేరని అధిష్టానానికి అందిన నివేదికల్లో వెల్లడయింది. వీరంతా వైఎస్ వీరాభిమానులైన కాంగ్రెస్ కార్యకర్తలు. మూడురోజుల పాటు టివిల్లో వచ్చిన వార్తలు చూసి తట్టుకోలేక 90 శాతం గుండె ఆగి మృతి చెందారని, మరో 5 శాతం మంది ఆత్మహత్య చేసుకోగా.. మిగిలిన వారంతా వైఎస్ మృతి చెందినందున పోడుభూమి హక్కురాదన్న బెంగ, ఇల్లు, పించన్లు ఇక రావన్న బాధతో మృతి చెందినట్లు ఆ నివేదికల్లో వెల్లడయింది. ఇవన్నీ కూడా నిజమయిన మరణాలేనని అధిష్టానం తేల్చింది.
Pages: -1- 2 -3- News Posted: 18 September, 2009
|