తగ్గని ఒడిఐల ప్రాముఖ్యం
ఇక ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాను సవాల్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్న జట్టు ఆస్ట్రేలియా. ఈ జట్టు విభిన్న పరిస్థితులలో టోర్నమెంట్ లోకి అడుగుపెడుతున్నది. ఏడు పోటీల ఒడిఐ సీరీస్ లో 6-1తో ఇంగ్లండ్ ను చిత్తు చేసిన ఆసీస్ జట్టు మంగళవారం దక్షిణాఫ్రికా చేరుకుంటున్నది. ఏషెస్ ను కోల్పోయిన ప్రభావం నుంచి తాము త్వరగానే బయటపడ్డామని ఆసీస్ భావిస్తున్నారు.
కాగా, అగ్ర స్థానంలో నిలవగలదని భావిస్తున్న మూడవ జట్టు ఇండియా. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని జట్టు గడచిన 18 నెలలుగా ఎంతో నిలకడగా రాణిస్తూ క్రీడాభిమానుల మెప్పు పొందుతున్నది. శ్రీలంకలో అత్యంత సంక్లిష్ట పరిస్థితులలో ముక్కోణపు సీరీస్ ను గెలుచుకున్న భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీకి సరైన రీతిలో సన్నద్ధమైంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో న్యూజిలాండ్ చేతిలో 103 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ భారత జట్టు నైతిక స్థైర్యం కోల్పోలేదు. ఓపెనర్ గౌతమ్ గంభీర్ పునరాగమనం వల్ల రాహుల్ ద్రావిడ్ తన సాంప్రదాయక మూడవ స్థానంలో బ్యాట్ చేయవచ్చు. సచిన్ టెండూల్కర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. టాప్ ఆర్డర్ కనుక గట్టి వేదికను ఏర్పరచగలిగితో ఆతరువాత ధోని, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్ స్వైరవిహారం సాగించడానికి వీలు ఉంటుంది.
అయితే, కొలంబోలో బౌలింగే ఇండియాకు ఆందోళనకరంగా ఉన్నది. కాని హర్భజన్ సింగ్ సరైన సమయంలో రాణించడం జట్టుకు కలసి వచ్చింది. దక్షిణాఫ్రికాలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండడం ఫాస్ట్ బౌలర్లకు ప్రోత్సాహకరమే అవుతుంది. సాధారణంగా దక్షిణాఫ్రికా పరిస్థితులలో భారత బౌలర్లు సఫలీకృతులవుతుంటారు. జహీర్ ఖాన్ లేకపోయినప్పటికీ జట్టులో స్థానాల కోసం పేస్ బౌలర్ల మధ్య పోటీ కొనసాగుతోంది.
గత రెండు సార్లు చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా ప్రాథమిక దశను దాటి ముందుకు సాగలేకపోయింది. ఏ జట్టు కూడా రెండు సార్లు ఈ టోర్నమెంట్ ను గెలుచుకోలేదు. పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్లు ఒక్కసారి కూడా ఈ టోర్నీని గెలుచుకోలేదు.
Pages: -1- 2 News Posted: 22 September, 2009
|