పాకిస్తాన్ గెలిచింది షోయబ్ మాలిక్‌కు జత కలిసిన యూసుఫ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. వీరిద్దరూ నిదానంగా ఆడుతూ సింగిల్స్ తీస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. దాంతో 23.1 ఓవర్లలో పాక్ స్కోరు 100కు చేరింది. 30 ఓవర్లు దాటాక పరుగుల వేగం పెంచారు. నాలుగో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యం అయిన వెంటనే యూసుఫ్ 55 బంతుల్లో కెరీర్‌లో 63వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లో మాలిక్ పాయింట్ దిశలో బౌండరీ కొట్టి 81 బంతుల్లో అర్ధసెంచరీని చేరుకున్నాడు. అర్ధసెంచరీ అనంతరం భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భజ్జీ బౌలింగ్‌లో మాలిక్ థర్డ్‌మ్యాచ్ దిశలో బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు. మాలిక్‌కు ఇది కెరీర్‌లో ఏడో సెంచరీ కాగా, భారత్‌పై నాలుగోది. అర్ధసెంచరీ తర్వా త మాలిక్ 25 బంతుల్లో సెంచరీకి చేరాడు. బ్యాటింగ్ పవర్ ప్లే తొలి ఓవర్‌లో యూసుఫ్ 88 బంతుల్లో 7 ఫోర్లతో 87 పరుగులు చేసి నెహ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. నాలుగో వికెట్‌కు మాలిక్-యూసుఫ్‌లు 206 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని అందించారు. అయితే పరుగులు పెంచే ప్రయత్నంలో అఫ్రిది (4), ఉమర్ అక్మల్ (4), గుల్ (0), అమీర్ (0) వెనువెంటనే నిష్ర్కమించారు. ఇక సెంచరీ హీరో మాలిక్ 126 బంతుల్లో 16 ఫోర్లతో 128 పరుగులు చేసి భజ్జీ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. దాంతో పాక్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేసింది. భారత బౌలర్లలో నెహ్రా ఒక్కడే రాణించి నాలుగు వికెట్లు తీసుకున్నాడు.
303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే ఎన్నో ఆశలు పెట్టుకున్న సచిన్ (8) ఔట్ అయ్యాడు. తన వికెట్ తీస్తానని చెప్పిన అమీర్ బౌలింగ్‌నే సచిన్ నిష్ర్కమించాడు. ఆ తర్వాత పాక్ బౌలర్లపై విరుచుపడిన గంభీర్ (57: 46 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. కొద్దిసేపటికే కోహ్లీ (16), ధోనీ (3)లు వెనుదిరిగారు. ఐతే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రైనా ద్రవిడ్‌తో కలిసి మెరుపులు మెరిపించాడు. భారత్ లక్ష్యానికి 98 పరుగుల దూరంలో ఉన్నప్పుడు 35 ఓవర్లలో 205/4 స్కోరు వద్ద అంపైర్ తప్పుడు నిర్ణయా నికి రైనా (46: 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) బలైయ్యాడు. ఇదే మ్యాచ్‌ను మలుపు తిరిగింది. ఆ తర్వాత యూసుఫ్ (5) వెంటనే నిష్ర్కమించాడు. సహనంతో బ్యాటింగ్ చేస్తున్న ద్రవిడ్ 76 (103 బంతుల్లో 4 ఫోర్లు) పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ఇక లో ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో భారత్ 44.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌట్ అయింది.
కాగా సెంచరీ చేసిన షోయబ్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన పాకిస్తాన్ సెమీ ఫైనల్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. భారత్ 28న ఆస్ట్రేలియాతోను, 30న వెస్టిండీస్ తోనూ జరిగే రెండు మ్యాచ్ లను తప్పని సరిగా గెలవవలసి ఉంది.
Pages: -1- 2 News Posted: 26 September, 2009
|